కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలి: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలి: వివేక్ వెంకటస్వామి
  • కాళేశ్వరం  కాంట్రాక్టర్ లు ప్రపంచంలోనే ధనికులు 
  • ఈడీ విచారణ చేయాలి
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

కోల్​బెల్ట్: కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అన్నారం బ్యారేజీ వరదలతో ముంపునకు గురవుతున్న సుందరశాల గ్రామంలో పంట భూములను ఆయన పరిశీలించారు. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ అధికారులతో రైతుల సమక్షంలో కరకట్ట నిర్మాణం కోసం సమీక్ష నిర్వహించారు. నాలుగేళ్లుగా అన్నారం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్ తో జరిగిన పంట నష్టాన్ని  ఎమ్మెల్యే వివేక్ కు చెప్పుతూ రైతులు కన్నీరు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలప్రజా ధనాన్ని  కేసీఆర్ వృథా చేశారన్నారు. అవినీతి కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్​చేశారు. తుమ్మిదిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టును కాదని కాళేశ్వరంను రీ డిజైన్ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కాంట్రాక్టర్ లు ప్రపంచంలోనే ధనికులు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్ల పైన ఈడీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తన పైన మాజీ ఎమ్మెల్యే సుమన్ ఒక్క ఫిర్యాదు చేయగానే ఈడీ విచారణ చేశారన్నారు. తాను గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అనేక మార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.  బ్యాక్ వాటర్ సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.