
- 15.237 కిలోల బంగారం, రూ.1.61 లక్షలు రికవరీ
- పరారీలో మరో ముగ్గురు..నిందితుల్లో ఎస్‌బీఐ మేనేజర్,
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, గోల్డ్ లోన్ సంస్థల ఉద్యోగులు
- రవీందర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్
- ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోవడంతో స్కామ్‌కు తెరలేపినట్లు గుర్తింపు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐ 2లో జరిగిన గోల్డ్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు, క్యాషియర్ రవీందర్‌తో పాటు మరో 43 మందిని అరెస్ట్ చేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో వెల్లడించారు. ఎస్‌బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగె రవీందర్ 2024 అక్టోబర్‌కు ముందు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షల వరకు నష్టపోయాడు.
బెట్టింగ్‌లో పోయిన డబ్బులు సంపాదించుకునేందుకు తాను పనిచేస్తున్న ఎస్‌బీఐ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయ్ లక్కాకుల సందీప్‌తో కలిసి గోల్డ్ స్కామ్‌కు ప్లాన్ చేశాడు. బ్యాంక్ లాకర్ కీస్ మేనేజర్ దగ్గర ఒకటి, క్యాషియర్ దగ్గర మరొకటి ఉండాల్సి ఉండగా.. మేనేజర్ తన వద్ద ఉన్న కీని కూడా క్యాషియర్‌కే ఇచ్చాడు. ఈ రెండింటినీ ఉపయోగించి రవీందర్ బంగారం, నగదు దొంగిలించడం ప్రారంభించాడు. ఇలా రూ.1.10 కోట్లతో పాటు రూ.12.61 కోట్ల విలువైన 20.50 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.
ఈ బంగారాన్ని తన ఫ్రెండ్స్ అయిన, మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఎస్‌బీఎఫ్‌సీ గోల్డ్ లోన్ సంస్థలో పనిచేస్తున్న కొంగొండి బీరయ్య, కొడతి రాజశేఖర్, బొల్లి కిషన్‌లకు ఇచ్చాడు. వారు బంగారాన్ని ఎస్‌బీఎఫ్‌సీతో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. వచ్చిన డబ్బుల్లో కొంత కమీషన్ తీసుకొని మిగతా మొత్తాన్ని రవీందర్‌కు ఇచ్చారు. ఇలా ఎస్‌బీఎఫ్‌సీ, ఇండెల్ మనీ, ముత్తూట్ ఫైనాన్స్, గోదావరి అర్బన్, మణప్పురం, ముత్తూట్ ఫిన్‌కార్ప్స్, ముత్తూట్ మినీ సంస్థల్లో 44 మంది పేర్లతో 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారు.
గోల్డ్ లేకుండానే రూ.1.58 కోట్ల లోన్...
రవీందర్ బ్రాంచ్ మేనేజర్ మనోహర్‌తో కుమ్మక్కై బంగారం తాకట్టు పెట్టకుండానే తన భార్య, బావమరిది, ఫ్రెండ్స్ పేర్లతో భారీ మొత్తంలో లోన్లు తీసుకున్నాడు. పలువురి పేర్లపై 42 గోల్డ్ లోన్లు శాంక్షన్ చేసి ఆ డబ్బులను వారి అకౌంట్లలో డిపాజిట్ చేసిన అనంతరం తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అలాగే ఏటీఎంలలో క్యాష్ రీఫిల్ చేసే టైమ్‌లో కూడా భారీమొత్తంలో పక్కదారి పట్టించారని సీపీ తెలిపారు.
44 మంది అరెస్ట్.. 15 కిలోల గోల్డ్ రికవరీ
మంచిర్యాల ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు గత నెల 23న మంచిర్యాల రీజినల్ మేనేజర్ రితేశ్‌కుమార్ గుప్తా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ప్రధాన నిందితుడైన, క్యాషియర్ నరిగె రవీందర్ అకౌంట్ నుంచి ఏడాదిలో రూ.10 కోట్లకుపైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో రవీందర్‌తో పాటు అతడికి సహకరించిన మేనేజర్ మనోహర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్, ఎస్‌బీఎఫ్‌సీ సిబ్బంది బీరయ్య, రాజశేఖర్, కిషన్‌తో పాటు వివిధ గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అయిన మరో 38 మందిని అరెస్ట్ చేయగా.. ముగ్గురు పరారీలో ఉన్నారని సీపీ వెల్లడించారు.
నిందితుల నుంచి ఇప్పటివరకు 15.237 కిలోల గోల్డ్, రూ.1.61 లక్షలు రికవరీ చేశామని తెలిపారు. మంచిర్యాల, చెన్నూరులోని ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్, ముత్తూట్ ఫిన్‌కార్ప్స్, ముత్తూట్ మినీల నుంచి మరికొంత బంగారాన్ని రికవరీ చేయాల్సి ఉందని సీపీ వెల్లడించారు.