కొత్త స్టేషన్లపై కిరికిరి: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు మోక్షమెప్పుడో

కొత్త స్టేషన్లపై కిరికిరి: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు మోక్షమెప్పుడో

కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణంలో దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కిరికిరి నడుస్తోంది. చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వే టెర్మినల్స్​ విషయంలో భూ బదలాయింపు కారణంగా పనులు జప్యం అవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే అధికారుల మధ్య సయోధ్య కుదరకపోవడంతోనే లేటవుతోందని సమాచారం. దీంతో చర్లపల్లి టెర్మనల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న జనాలకు నిరాశ తప్పటం లేదు. దాదాపు రూ.100 కోట్లతో  250 ఎకరాల పరిధిలో టెర్మినల్ నిర్మించాలని భావించారు. ఇందుకు రైల్వే శాఖ కూడా ఓకే చెప్పేసింది. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం యాదాద్రి వరకు ప్రత్యేక లైన్ వేస్తుండటంతో నగర ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందనుకున్నారు.  భూమి సేకరణకు సంబంధించి అప్పట్లోనే సీఎం కేసీఆర్ ను రైల్వే అధికారులు కలిశారు. చర్లపల్లి టెర్మినల్ తో సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లపై భారం తగ్గుతుందని భావించిన కేసీర్​భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే సికింద్రాబాద్ లో ఉన్న రైల్వే భూముల్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు కావాల్సిన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. కానీ రైల్వే శాఖ నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో చర్లపల్లి టెర్మినల్ కు భూమి ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో చర్లపల్లి టెర్మినల్ ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది.

చర్లపల్లి టెర్మినల్ పరిస్థితి ఏంటి
పనులు సజావుగా సాగితే ఈ పాటికే చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం పూర్తయ్యేది. కానీ కావాల్సినంత భూమి లేకపోవటంతో రైల్వే అధికారులు ప్రస్తుతానికి ఉన్న 50 ఎకరాల స్థలంలో 3 అదనపు ప్లాట్‌‌ఫామ్స్, 3 పిట్‌‌లైన్స్‌‌తో టెర్మి నల్‌‌ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి పూర్తి అయితే కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను ఇక్కడ నిలపాలని భావిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు వచ్చే బాధ ప్రయాణికులకు తప్పుతుంది. ముంబై నుంచి వచ్చే రైళ్లను నాగులపల్లి టెర్మినల్ వద్ద ఆపాలని భావించారు. ఈ టర్మినల్ నిర్మాణానికి రైల్వే అధికారులు 300 ఎకరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ 150 ఎకరాల వరకే ఇవ్వగలమని చెప్పటంతో నాగులపల్లి టెర్మినల్ కథ కూడా పెండింగ్​ జాబితాలో చేరింది.

సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై భారం తగ్గాలంటే
హైదరాబాద్ నగరంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య బట్టి చూస్తే మరిన్ని రైల్వే స్టేషన్ల అవసరం ఉంది. అప్పట్లో నిర్మించిన మూడు రైల్వే స్టేషన్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ ప్రయాణికుల సంఖ్య 10 రెట్లకు పైగా పెరిగింది. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో నిత్యం రద్దీ ఉంటోంది. శివారు ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులు రైలు ఎక్కాలంటే సికింద్రాబాద్, నాంపల్లి దాకా రావాల్సి ఉంటోంది. ఒక్క సికింద్రాబాద్ నుంచే రోజుకు దాదాపు లక్షా 50 వేలకు పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇక ప్రత్యేక సందర్భాల్లో అయితే ఆ సంఖ్య 2నుంచి మూడు లక్షల వరకు ఉంటోంది. ప్రయాణికులు సికింద్రాబాద్, నాంపల్లి వరకు రావాల్సి ఉండటంతో సిటీలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతోపాటు రైల్వే స్టేషన్లలో జనానికి సరిపడ సౌకర్యాలు లేవు. ఈ స్టేషన్లను విస్తరించే అవకాశం లేకపోవటంతో ఫ్లాట్ ఫామ్ పై ప్రయాణికులు నిలబడేందుకు కూడా చోటు సరిపోవడం లేదు. రద్దీ దృష్ట్యా శివారు ప్రాంతాల్లో మరో 4 లేదా 5 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించాల్సిన అవసరం ఉంది.  ఈ సమస్యకు పరిష్కారంగా నగరం నలువైపులా రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయాలని పదేళ్ల క్రితమే హెచ్ఎండీఎ భావించింది. కానీ ఆ ప్రతిపాదన ఇప్పటికీ అములుకు నోచుకోవడం లేదు.