చిరపుంజీ ఆఫ్ సౌత్.. తప్పకుండా చూడాల్సిన ప్లేస్

చిరపుంజీ ఆఫ్ సౌత్.. తప్పకుండా చూడాల్సిన ప్లేస్

నిన్న మొన్నటి దాకా ఎండలతో విసిగిపోయి ఉన్నారు అందరూ. అందుకే మొన్న  ఒక్క వర్షం పడగానే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఒక్క వర్షానికి అలా అనిపిస్తే.. రోజూ వర్షం పడే ప్లేస్‌‌కి వెళ్తే ఎలా ఉంటుంది?  చాలా బాగుంటుంది కదూ!  కానీ, మనకు దగ్గర్లో అలాంటి ప్లేస్ ఎక్కడ ఉందనేగా మీ సందేహం. మన పక్కరాష్ట్రం కర్నాటకలోనే ఉంది. అదే అగుంబే. సౌత్ ఇండియాలో ఎక్కువ  వర్షపాతం ఉండేది ఇక్కడే.  అందుకే దీన్ని ‘చిరపుంజీ ఆఫ్ సౌత్’ అంటారు. ఇక్కడ అప్పుడప్పుడు పలకరించే వర్షపు చినుకులు  తప్ప, ఇంకెలాంటి వాహనాల  శబ్దాలు,  ఇరుగుపొరుగు మాటలు వినిపించవు. కాంక్రీట్ వరల్డ్‌‌కి దూరంగా కొద్ది రోజులైనా ఇలాంటి వాతావరణంలో విహరించాల్సిందే!

అగుంబే కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో ఉంది. దీన్ని ‘చిరపుంజీ ఆఫ్ సౌత్’  అంటారు. ఈ ప్రాంతం దట్టమైన అడవుల మధ్య ఉంటుంది.  మైమరపించే జలపాతాలకు, అత్యద్భుతమైన సౌందర్యానికి అగుంబే పెట్టింది పేరు. మాన్‌‌సూన్‌‌లో ఒక్కసారైనా  ప్రకృతి ప్రేమికులు చూడాల్సిన చోటు ఇది.  కొండల్ని తాకుతూ వెళ్లే మేఘాలు, అప్పుడప్పుడు ఏకధాటిగా కురిసే వర్షం. చుట్టూ పచ్చగా కనిపించే పరిసరాలు ప్రకృతి ప్రేమికుల్ని ఇట్టే కట్టిపడేస్తాయి.  జూన్‌‌ మొదలవగానే ఇక్కడ సందడి కనిపిస్తుంది. అగుంబేలో అడవులు, అటవీ జంతువులు, జలపాతాలు  ఎటుచూసినా సహజ అందాలే కనిపిస్తాయి.  సాహసాలు, ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్లకు కూడా ఇది మంచి ప్లేస్.  దట్టమైన అడవుల్లో, వర్షంలో తడుస్తూ  కొండలు ఎక్కడం రియల్ అడ్వెంచర్.

అందమైన జలపాతాలు
వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతం కాబట్టి  ఇక్కడ చాలా  జలపాతాలు సహజంగా  ఏర్పడ్డాయి.  వాటిలో ఒకటి  కుంచికాళ్‌‌ జలపాతం.  ఇది ఇక్కడి  టూరిస్టులకు మరో అట్రాక్షన్. ఇది దేశంలోనే ఎక్కువ ఎత్తు నుంచి పడుతున్న జలపాతాల్లో ఒకటి. ఇది 1493 అడుగుల ఎత్తు నుంచి పడుతూ చూసేవాళ్లకి చిన్నపాటి నయాగారాలా అనిపిస్తుంది. వారాహి నది.. ఈ జలపాతం నుంచే పుడుతుంది.

మరో జలపాతం ‘బర్కానా’. ఇది 850 అడుగుల ఎత్తు నుంచి  పడుతుంది.  సీతానది కొండలపై నుంచి ప్రవహిస్తుంది కాబట్టి దీనికి  ‘సీతా జలపాతం’ అనే మరో పేరు కూడా ఉంది. ఈ జలపాతాన్ని చేరాలంటే  గుంబో ఘాట్ల ద్వారా ట్రెక్కింగ్ చేయాలి లేదా బైక్ రూట్‌‌లో వెళ్లాలి.

ఆగుంబేకు దగ్గర్లో ఉండే మరో జలపాతం ‘ఒనకి’ జలపాతం. కన్నడలో ‘ఒనకి’ అంటే ‘దంపుడు కర్ర’  అని అర్థం. ఈ జలపాతం చూడ్డానికి అలాగే కనిపిస్తుందని దానికి ఆ పేరు పెట్టారు. మెట్ల ద్వారా అక్కడికి  చేరుకోవచ్చు.

ఇక్కడికి మూడు కిలో మీటర్ల దూరంలో జోగి గుండి జలపాతాలు ఉంటాయి. ఇవి చాలా పురాతనమైనవి. సుమారు 829 అడుగుల ఎత్తునుంచి పడతాయి. ఇక్కడకు చేరుకోవాలంటే సగం దూరం బైక్ లేదా కార్‌‌‌‌లో వెళ్లి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి.

ఇక్కడుండే మరో జలపాతం తీర్థ జలపాతాలు.  అగుంబే వచ్చిన ప్రతి ఒక్కళ్లూ వీటిని చూసి తీరాల్సిందే. ఈ జలపాతం 126 అడుగుల ఎత్తునుంచి ఒక సరస్సులోకి పడుతుంది. మూడు కిలోమీటర్లు అడవిలో ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి చేరుకోవాలి.

ఎన్నో రీసెర్చ్‌‌లు..
అగుంబేలో పాములు, ఇతర విష కీటకాలు ఎక్కువగా  సంచరిస్తుంటాయి. కింగ్‌‌ కోబ్రా పాముని మొట్టమొదటిసారి గుర్తించింది కూడా ఇక్కడే. అందుకే  అగుంబేలో అక్కడక్కడ  పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు కనిపిస్తారు. జంతువుల మీదే కాకుండా అడవులు, వృక్షాలు, వర్షాలపై కూడా పరిశోధనలు జరుగుతుంటాయి ఇక్కడ.

సూర్యాస్తమయానికి
అగుంబేకు వచ్చే టూరిస్టుల్లో సన్‌‌సెట్ చూడడానికి వచ్చేవాళ్లే ఎక్కువ.  అరేబియా సముద్రం ఇక్కడి నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అంత  దూరం ఉన్నప్పటికీ.. అగుంబే ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడి నుంచి కూడా  సన్‌‌సెట్ కనిపిస్తుంది. అరేబియా సముద్రంలోకి సూర్యుడు వెళ్లిపోతున్నాడా అన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ చూసేవాళ్లను  కట్టిపడేస్తుంది. అప్పట్లో మాల్గుడి డేస్ టీవీ సీరియల్ షూట్ చేసింది  కూడా ఇక్కడే.

వసతి
అగుంబేలో ఉండడానికి, తినడానికి ఎలాంటి లోటు ఉండదు. ఇక్కడ చాలా రిసార్ట్‌‌లు, హోటళ్లు ఉన్నాయి. అగుంబే వెళ్లే టూరిస్టులు ఇక్కడి లోకల్ వంటకాలు కూడా రుచి చూడాలి. ఎన్నో రుచులకు అగుంబే ఫేమస్.

ఎలా చేరుకోవాలి ?

అగుంబేకు దగ్గర్లోని  విమానాశ్రయం మంగుళూరు. 93 కిలోమీటర్ల  దూరంలో ఉంది. మంగుళూరు నుంచి క్యాబ్ లేదా టాక్సీలో అగుంబే చేరుకోవచ్చు.

రైలులో వెళ్లాలంటే ఉడుపి స్టేషన్‌‌లో దిగాలి. ఇక్కడి నుంచి అగుంబే 53 కిలోమీటర్లు.  బస్సు, క్యాబ్‌‌లో అగుంబే చేరుకోవచ్చు.