శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు..

శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు..
  • శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం 

నార్కట్ పల్లి,  వెలుగు: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మాఘశుద్ధ గడియల్లో స్వామి కల్యాణోత్సవాన్ని  అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పట్టు వస్త్రాలను , ముత్యాల తలంబ్రాలను అందజేశారు. స్వామి కల్యాణాన్ని అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షితవధాని, ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, అర్చకుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల  మధ్య వైభవంగా నిర్వహించారు. 

ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వృషభ వాహనంపై ఆలయ పురవీధుల గుండా ఊరేగించారు.  లక్ష మంది పైగా  భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. కల్యాణాన్ని ఎక్కడికక్కడ తిలకించడానికి భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులు స్వామిఅమ్మవారులకు ఒడి బియ్యం, తలంబ్రాలను సమర్పించడానికి కిలోమీటర్ల మేర బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది. ఈ కల్యాణానికి శివసత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

వేల సంఖ్యలో వచ్చిన శివసత్తులు స్వామి అమ్మవారులకు ప్రత్యేకంగా అలంకరించిన బుట్టలలో ఒడిబియ్యం, వస్త్రాలను సమర్పించారు. సుమారు 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కట్ పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు నిరంతరం మైక్స్ ద్వారా భక్తులకు సూచనలు చేశారు. కల్యాణానికి స్థానిక రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 

కార్యక్రమంలో ఆర్డీవో ఎన్​. అశోక్​ రెడ్డి​, దేవాలయ ఈవో మోహన్​ బాబు,​ ​ఉత్సవ కమిటీ చైర్మన్​ వారాల రమేశ్, సర్పంచ్ నేతగాని కృష్ణయ్య ,కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్​, బండ సాగర్​ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు కమ్మలపల్లి  మల్లేశ్, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, ఇడుకుల సంపత్, రేగట్టే శ్రీనివాస్ రెడ్డి, మరి లింగస్వామి, గడుసు శశిధర్ రెడ్డి, రేగటె నవీన్​ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.