
- లోకల్ బాడీ ఎన్నికలే కారణం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల జేఏసీలు ఏర్పాటు
- పోటాపోటీగా కార్యక్రమాల నిర్వహణ
- 12న విద్యా సంస్థల బంద్ కు పిలుపు
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమం మళ్లీ ఉధృతమవుతోంది. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు జేఏసీలు ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ఆధ్వర్యంలో జేఏసీలు ఏర్పాటై పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రామగళ్ల పరమేశ్వర్ నేతృత్వంలో కాంగ్రెస్, సీపీఐ నేతలతో ఒక జేఏసీ, వకులాభరణం నర్సయ్య నేతృత్వంలో బీఆర్ఎస్, సీపీఎం ప్రజా సంఘాలతో మరొక జేఏసీ రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమిస్తున్నాయి.
కాంగ్రెస్ జేఏసీ ఇటీవల చేర్యాల బంద్ నిర్వహిస్తే, బీఆర్ఎస్ జేఏసీ మానవ హారంతో పాటు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. కాంగ్రెస్ ఈ నెల 12న చేర్యాల సబ్ డివిజన్ పరిధిలో విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని కాంగ్రెస్ నేతలు, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది.. వెంటనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రెవెన్యూ డివిజన్‌పై స్పష్టత కరువు..
కొంత కాలం కింద జేఏసీ నాయకులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి చేర్యాల డివిజన్ ఏర్పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనగామ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ విషయాన్ని గుర్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ తరపున చేర్యాల డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అందులో చేర్యాల మున్సిపాలిటీతో పాటు 16 గ్రామాలు, కొమురవెల్లి 8, మద్దూరు 18, ధూల్మిట్టలో6 గ్రామాలతో కలిపి మొత్తం 48 గ్రామాలతో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. కానీ తర్వాత దీనిపై స్పష్టత కరువైంది.
8 ఏండ్లుగా కొనసాగుతున్న ఉద్యమం
చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 8 ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. 2016 లో జిల్లాల పునర్విభజనలో భాగంగా జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ లోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, మండలాలు సిద్దిపేట జిల్లాలో కలువగా ఇటీవల కొత్తగా ధూల్మిట్ట మండలాన్ని ఏర్పాటు చేశారు. చేర్యాల కేంద్రంగా కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట మండలాలను కలిపి కొత్త గా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఇటీవల కొంత పురోగతి కనిపించినా తర్వాత ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.
రెవెన్యూ డివిజన్ తో చేర్యాలకు పూర్వ వైభవం
రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో చేర్యాలకు పూర్వ వైభవం సంతరించుకోనుంది. పాలనాంశాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతోనే చేర్యాల రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. డివిజన్ ను సాధించడం కోసం రాజకీయ పార్టీలతో పాటు సామాజిక, స్వచ్ఛంద సంస్థలతో కలసి జేఏసీ ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేస్తున్నాం. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పార్టీల ఎజెండా కాదు ప్రజల ఎజెండా. దాన్ని సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తాం.పరమేశ్వర్, కాంగ్రెస్ జేఏసీ చైర్మన్
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి
చేర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల 4 మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తాం.- వకుళాభరణం నర్సయ్య, బీఆర్ఎస్ జేఏసీ చైర్మన్