Cheteshwar Pujara: ఒక్కడే 20వేల పరుగులు: దిగ్గజాల సరసన పుజారా

Cheteshwar Pujara: ఒక్కడే 20వేల పరుగులు: దిగ్గజాల సరసన పుజారా

టీమిండియా నయా వాల్ చటేశ్వర్ పుజారా భారత జట్టులో చోటు దక్కకపోయినా దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా తొలి పోరులోనే అజేయ డబుల్ సెంచరీతో విజృంభించి నేషనల్ సెలెక్టర్లను మెప్పించాడు. జార్ఖండ్‌‌‌‌తో గ్రూప్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో 243  రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. తాజాగా విదర్భతో జరిగిన మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేసిన ఈ వెటరన్ ప్లేయర్.. రెండో ఇన్నింగ్స్ లో 66 పరుగులు చేసి సౌరాష్ట్రను పటిష్ట స్థితికి చేర్చాడు. ఈ ఇన్నింగ్స్ తో అరుదైన ఘనతను సాధించిన పుజారా దిగ్గజాల సరసన చేరాడు.
   
ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 20000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ టెస్ట్‌లు, దేశవాలీ టోర్నీలు కలిసి మొత్తం 260 మ్యాచ్ లాడిన పుజారా.. 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. వీటిలో 61 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు దిగ్గజ బ్యాటర్లు సునీల్ గవాస్కర్(25834), సచిన్ టెండూల్కర్(25396), రాహుల్ ద్రావిడ్ లు(23794) మాత్రమే భారత్ తరపున 20 వేలకు పైగా పరుగులు చేశారు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు జాక్‌ హాబ్స్‌ పేరిట ఉంది. హాబ్స్‌ 1905-34 మధ్యలో 61760 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే..తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌటైంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర.. పుజారాతో పాటు కెవిన్‌ జివ్‌రజనీ (57), విశ్వరాజ్‌ జడేజా (79) రాణించడంతో 244 పరుగులు చేసి ఆలౌటైంది. 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విదర్భ మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. అథర్వ తైడే (42), హర్ష్‌ దూబే (0) క్రీజ్‌లో ఉన్నారు.