
ఛత్తీస్ఘడ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మనోజ్ సింగ్ మాండవి (58) గుండెపోటుతో కన్నుమూశారు. స్వగ్రామం నాథియా సవాగాన్ లో శనివారం అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ధామ్ తరిలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే ఆయన మృతి చెందారు.
మనోజ్ సింగ్ మృతికి ఛత్తీస్ ఘడ్ సీఎం బూపేష్ బాఘెల్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. ప్రస్తుతం మనోజ్ సింగ్ మాండవి కంకేర్ జిల్లాలోని భాను ప్రతాప్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మనోజ్ సింగ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో మొదటిసారి ఎమ్మెల్యే కాగా.. 2013, 2018లో భానుప్రతాపూర్ నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. 2019లో ఛత్తీస్‌గఢ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు.