
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగర్ గుండా అటవీప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. మావోయిస్టుల మృతదేహాల వద్ద 303 రైఫిల్, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామాగ్రి పోలీసులకు లభించింది. ఎన్ కౌంటర్ అనంతరం మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.