7 గంటల్లో 101 ఆపరేషన్లు.. డాక్టర్‌‌కు షోకాజ్ నోటీసులు

7 గంటల్లో 101 ఆపరేషన్లు.. డాక్టర్‌‌కు షోకాజ్ నోటీసులు

రాయ్‌పూర్: ఒక డాక్టర్‌‌ కేవలం ఏడు గంటల్లోనే సెంచురీ కొట్టారు. రికార్డు స్థాయిలో 101 ఆపరేషన్లు చేసి సమస్యల్లో చిక్కుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రోజులో అన్ని ఆపరేషన్లు చేసినందుకు ఆ డాక్టర్‌‌కు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ ఇష్యూపై విచారణకు ఆదేశించింది.

ఆగస్టు 27న చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సుర్గుజా జిల్లాలోని నర్మదాపూర్‌‌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపు నిర్వహించింది. ఈ సందర్భంగా జిబ్నస్‌ ఎక్కా అనే డాక్టర్‌‌ కేవలం ఏడు గంటల వ్యవధిలో 101 మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశారు. రికార్డు స్థాయిలో చేసిన ఈ ఆపరేషన్లపై లోకల్‌ న్యూస్‌ పేపర్లలో కథనాలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి ఆపరేషన్లు చేసిన డాక్టర్‌‌కు, లోకల్ హెల్త్ ఆఫీసర్‌‌కు షోకాజ్ నోటీసులు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపు జరిగిన తీరుపై కంప్లైంట్స్ అందాయని, దీంతో దర్యాప్తుకు ఆదేశించామని చత్తీస్‌గఢ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ అలోక్ శుక్లా చెప్పారు.

డైలీ లిమిట్ దాటి ఆపరేషన్లు

ఆ క్యాంపులో ప్రభుత్వ సర్జన్ డాక్టర్ జిబ్నస్ ఎక్కా 101 ఆపరేషన్లు చేశారని, ఈ ఆపరేషన్లు చేయించుకున్న ఏ ఒక్క మహిళకూ ఇబ్బంది తలెత్తలేదని డాక్టర్ అలోక్ శుక్లా తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ఒక సర్జన్ రోజులో 30 ఆపరేషన్లకు మించి చేయకూడదని, ఈ నిబంధనను ఉల్లంఘించిన నేపథ్యంలో ఎంక్వైరీకి ఆదేశించామని ఆయన చెప్పారు. ఆ డాక్టర్‌‌కు షోకాజ్ నోటీస్‌ కూడా ఇచ్చామని చెప్పారు. ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు.

నా తప్పేం లేదు

ఈ వ్యవహారంపై ఆపరేషన్లు చేసిన ప్రభుత్వ డాక్టర్ జిబ్నస్ స్పందించారు. ఈ విషయంలో తన తప్పేంలేదని, ఆ రోజు భారీ సంఖ్యలో మహిళలు క్యాంపు వద్దకు వచ్చి, ఆపరేషన్ చేయాల్సిందిగా కోరారని ఆయన చెప్పారు. తామంతా మారుమూల పల్లెల నుంచి వస్తున్నామని, మళ్లీ మళ్లీ తిరగలేమని చెప్పి వాళ్లు రిక్వెస్ట్ చేశారని అన్నారు. 

డాక్టర్ జిబ్నస్ ఎక్కాతో పాటు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్‌‌ఎస్ సింగ్‌కు కూడా ఆగస్టు 29న షోకాజ్ నోటీసులు ఇచ్చామని సుర్గుజా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పీఎస్ శిసోడియా  తెలిపారు. ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపే 101 ఆపరేషన్లను ఆ డాక్టర్ చేశారని, దీనిపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశామని, నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకంటామని చెప్పారు.