రోడ్లపై నగ్నంగా.. అసెంబ్లీ వైపు పరిగెత్తిన ఎస్సీ, ఎస్టీ యువకులు

రోడ్లపై నగ్నంగా.. అసెంబ్లీ వైపు పరిగెత్తిన ఎస్సీ, ఎస్టీ యువకులు

మాములుగా చెబితే వినటం లేదు.. ప్రశ్నిస్తే ఖాతరు చేయటం లేదు.. నిలదీస్తే తప్పించుకుని వెళుతున్నారు.. ధర్నా చేస్తే లెక్కే లేదు.. ఆందోళనలు చేసినా పట్టించుకున్న పాపాన పోవటం లేదు.. ఇక లాభం లేదనుకున్న ఈ కుర్రోళ్లు.. వినూత్న రీతిలో విషయాన్ని జనానికి చెప్పాలనుకున్నారు.. అంతేకాదు తమ చర్య వల్ల ప్రభుత్వం దిగిరావాలని డిసైడ్ అయ్యారు. 

ఇందులో భాగంగానే నగ్నంగా.. నూలుపోగు కూడా లేకుండా.. ప్లకార్డులు పట్టుకుని.. రోడ్లపై పరిగెడుతూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు.. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో కుర్రోళ్లు.. నగ్నంగా అసెంబ్లీ వైపు పరిగెత్తటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అసలు సమస్య ఏంటీ.. ఎందుకు వీరు ఇలా చేశారు.. కారణం ఏంటీ అనేది అందరిలో తలెత్తింది. మన దేశంలో.. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఉపాధి పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాయ్‌పూర్‌లో  యువకులు నగ్న ప్రదర్శన నిర్వహించారు. 12 మందికి  పైగా నగ్న నిరసనకారులను ఛత్తీస్ గడ్ శాసనసభ వైపు దూసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లో 267 మంది షెడ్యూల్డ్ కులాలు, తెగల నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఉద్యోగాలు చేస్తున్నారని బాధితులు వెల్లడించారు. అయినా వారిపై ప్రభుత్వ  యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందుకే నగ్న ప్రదర్శన చేశామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగల నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేశామన్నారు. కానీ తమ గోడును వినలేదన్నారు. అందుకే ఇప్పుడు నగ్నంగా నిరసన ప్రదర్శనలు చేశామన్నారు. ఇప్పటికైనా నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిని అరెస్ట్ చేయాలని.. వారి జీతాల ద్వారా  సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని  మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


ఛత్తీస్ గడ్ అసెంబ్లీ నాలుగు రోజుల వర్షాకాల సమావేశాలు జులై 18వ తేదీ మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసన కారులు నగ్నంగా నిరసన తెలిపారు. విధాన సభవైపు నగ్నంగా పరిగెత్తారు. దీంతో  నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్ గడ్  రాయ్‌పూర్‌ నగరంలోని పాండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ సియోని మలుపు దగ్గర నిరసనకారులను అరెస్ట్ చేశారు.  అయితే విధానసభకు వెళ్లే రహదారిపై పెద్ద సంఖ్యలో యువకులు నగ్నంగా నినాదాలు చేయడాన్ని చూసిన చాలా మంది వ్యక్తులు  వీడియోలు తీశారు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో  వైరల్ అయ్యాయి.