
ఈ ఊళ్లో ఏ ఇంట్లో చూసినా కెమెరాలు, వాటి స్టాండ్లే కనిపిస్తాయి. వీధుల్లో ఏ మూల చూసినా యూట్యూబ్ వీడియోల షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు. అందుకే ఈ ఊరిని యూట్యూబ్ విలేజ్ అంటున్నారు. యూట్యూబ్‌నే కెరీర్‌గా ఎంచుకున్న ఈ ఊరు ఎక్కడుందంటే..
ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్ జిల్లాలోని తుల్సి ఊళ్లో ఎక్కువమంది యువత యూట్యూబ్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. మూడువేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో 40 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఊళ్లో 40 శాతం మంది యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.
వాళ్లను చూసి..
ఈ ఊళ్లో యూట్యూబ్ కల్చర్ జ్ఞానేంద్ర శుక్ల, జై వర్మ అనే ఇద్దరు స్నేహితులతో మొదలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నెట్వర్క్ ఇంజినీర్‌గా పని చేసిన జ్ఞానేంద్ర, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి టీచింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టుకున్న జై వర్మ ఇద్దరూ వాళ్లు చేస్తున్న జాబ్ మానేసి 2012లో యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. దాంట్లో ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తూ, సొసైటీకి ఉపయోగపడే మెసేజ్‌లు ఇచ్చేవాళ్లు. 1.15 లక్షల సబ్‌స్ర్కయిబర్లు ఉన్న వీళ్ల ఛానెల్లో ఇప్పటివరకు 250కి పైగా వీడియోలు అప్లోడ్ చేశారు.
అప్పుడే టిక్‌టాక్ వీడియోల ట్రెండ్ మొదలైంది. అందరికీ మొబైల్ ఫోన్లు ఉండటం వల్ల వాళ్లూ రీల్స్ చేయడం మొదలుపెట్టారు. జై, జ్ఞానేంద్రల వీడియోలకు యూట్యూబ్‌నుంచి డబ్బు వస్తుందని తెలుసుకొని మిగతా వాళ్లకూ యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాలనే ఆలోచన వచ్చింది. దాంతో అందరూ ఛానెల్స్ పెట్టి వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఆ ఊరి యూట్యూబ్ ఛానెల్స్ నుంచి ఇప్పటివరకు ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, షార్ట్ ఫిల్మ్స్, వ్లాగ్స్... ఇలాి రకరకాల వీడియోలు వస్తున్నాయి.
ఒకప్పుడు ఈ ఊళ్లో ఆడవాళ్లను చదివించేందుకు ఇష్టపడేవాళ్లు కాదు. పెండ్లి చేసి, పంపించాలని చూసేవాళ్లు. అలాంటిది ఇప్పుడు వాళ్లు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి, డబ్బు సంపాదిస్తున్నారు. మొత్తంమీద యూట్యూబ్ ట్రెండ్ వల్ల సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ దొరికిందని ఆనందపడుతున్నారు అక్కడి ఆడవాళ్లు.