అనాథ పిల్లలను చావబాదింది.. ఏడుస్తూ వేడుకున్న ఆపలేదు

అనాథ పిల్లలను చావబాదింది.. ఏడుస్తూ వేడుకున్న ఆపలేదు

చత్తీస్​గఢ్: ఓ అడాప్షన్ సెంటర్ మహిళ ఇద్దరు అనాథ పిల్లలను చావబాదింది. పసివాళ్లనే కనికరం కూడా లేకుండా దారుణంగా కొట్టింది. వాళ్లు ఏడుస్తూ వేడుకుంటున్నా ఆపలేదు. చత్తీస్​గఢ్​ కాంకేర్ జిల్లాలోని అనాథ ఆశ్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి సబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో వైరల్ అయింది. ప్రతిజ్ఞ వికాస్ సంస్థ నిర్వహిస్తున్న స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆ ఏజెన్సీకి సూపరింటెండెంట్​గా సీమా ద్వివేది అనే మహిళ విధులు నిర్వహిస్తోంది. ఏం జరిగిందో తెలియదు గానీ, ఐదు.. ఆరేండ్ల వయసున్న ఇద్దరు బాలికలను ఆమె కొట్టడం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. మొదట ఒక చిన్నారిని కొడుతూ జుట్టు పట్టుకుని లేపి నేలమీదికి పడేసింది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారిని మరోసారి లేపి పక్కనే ఉన్న మంచంపైకి విసిరేసి మరీ కొట్టింది. మరో చిన్నారిని పిలిచి ఆ పాపను కూడా చితకబాదింది. 

చర్యలు తీసుకున్న కలెక్టర్..

ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటపడటంతో కాంకేర్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. సీమా ద్వివేదిపై కేసు ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. సదరు ఎన్జీవో పర్మిషన్ సస్పెండ్ చేశామని, పూర్తిగా రద్దు చేయాలని సంబంధిత శాఖను కోరినట్లు వెల్లడించారు. అయితే, పిల్లలను కొట్టిన ఘటన ఏడాది కిందటిదని, అప్పట్లో తన మానసిక స్థితి సరిగా లేనందునే అలా జరిగిందని ద్వివేది పోలీసులకు వివరణ ఇచ్చుకుంది. అంగన్ వాడీ స్కూల్​నుంచి తిరిగి అడాప్షన్ సెంటర్​కు వస్తున్న సమయంలో చిన్నారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చాక్లెట్లు తీసుకునేదని, అందుకే అలా కొట్టానని చెప్పింది.