చిదంబరం ఆనాటి లాయర్​..ఈ రోజు నిందితుడు

చిదంబరం ఆనాటి లాయర్​..ఈ రోజు నిందితుడు

గడచిన 48 గంటలు దేశమంతా ఒకటే వార్తకోసం ఆత్రుతగా ఎదురు చూసింది. కేంద్రంలో పదేళ్లపాటు చక్రం తిప్పిన మాజీ మంత్రి చిదంబరం అరెస్టుపై సస్పెన్స్​ థ్రిల్లర్​ని మించిన టెన్షన్​ సాగింది. క్విడ్​ ప్రో కో ఆరోపణలపై ఆయనకోసం సీబీఐ గాలించింది. మరో పక్క చిదంబరం కూడా తప్పించుకోవడానికి సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. స్వయంగా లాయర్​ అయిన చిదంబరానికి, ఆయన పార్టీలోనే హేమాహేమీలైన న్యాయవాదులు సలహాలిచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా ఎవ్వరూ చిదంబరం అరెస్టును ఆపలేకపోయారు.

దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ పళనియప్పన్ చిదంబరం. అలాంటి నాయకుడు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కుంభకోణంలో ఇరుక్కుని అరెస్టు కావడం ఆశ్చర్యమే. ఈ ఆరోపణలు, నిజానిజాల సంగతి ఎలాగున్నా  అరెస్టు కాకుండా  తప్పించుకోవడానికి అయన వేసిన ఎత్తుగడలు, ఆయనను అరెస్టు చేసిన పద్ధతి ఇవన్నీ కూడా ఎవరూ ఊహించని విషయాలే. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే దేశ రాజకీయాల్లో చిదంబరం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సంగతి తెలుస్తుంది.

సౌత్ నుంచి ఎదిగొచ్చిన  కాంగ్రెస్ లీడర్

పళనియప్పన్ చిదంబరం సౌత్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగొచ్చిన కాంగ్రెస్ నేత. వృత్తిరీత్యా ఆయన లాయర్. సుప్రీంకోర్టు లాయర్ గా కూడా పనిచేశారు. సోషలిస్టుగా రాజకీయ జీవితం మొదలెట్టిన చిదంబరం ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ లో చేరారు. మూడేళ్ల పాటు తమిళనాడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 1984 లో తొలిసారి శివగంగ సీటు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1989, 1991, 1996, 1998, 2004, 2009 ల్లో ఆయన లోక్ సభ కు ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఢిల్లీ కాంగ్రెస్ పాలిటిక్స్ లో కీలక నేతగా మారారు.1985 లో తొలిసారి రాజీవ్ గాంధీ కేబినెట్ లో మంత్రిగా చేరారు. కామర్స్ మినిస్ట్రీలో  సహాయమంత్రిగా చేరారు. ఆ తరువాత రాజకీయంగా ఆయన  వెనక్కి తిరిగి చూసుకోలేదు. హోం, ఆర్థికం వంటి కీలక శాఖలకు కేబినెట్ మంత్రిగా పనిచేశారు.

1996లో  కాంగ్రెస్ కు గుడ్ బై

1996 నాటికి తమిళనాడు రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. అప్పట్లో  తమిళ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న జీకే మూపనార్ తో కలిసి కొంతమంది నాయకులు ‘తమిళ మానిల కాంగ్రెస్’ (టీఎంసీ) పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. వీరిలో చిదంబరం కూడా ఉన్నారు. ఆ తర్వాత 1996 లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ మానిల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదే సమయంలో కేంద్రంలో దేవె గౌడ నాయకత్వంలో  యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా చేరారు. కొంతకాలానికి ఏ అన్నా డీఎంకేతో పొత్తును వ్యతిరేకించిందో అదే అన్నా డీఎంకేతో  తమిళ మానిల కాంగ్రెస్ జత కట్టింది. దీంతో 2001 లో టీఎంసీ నుంచి చిదంబరం బయటకు వచ్చి ‘కాంగ్రెస్ జన నాయక పెరవాయి’  ( సీజేపీ ) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత 2004 లోక్ సభ ఎన్నికలకు ముందు,  సొంత పార్టీని ఆయన కాంగ్రెస్ లో విలీనం చేశారు. చిదంబరం కాంగ్రెస్ లోకి మళ్లీ  ప్రవేశించారు.

ఫైనాన్స్ మినిస్టర్ గా లిబరలైజేషన్ కు అండ..

యూపీఏ ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలో 2004 నుంచి 2008 వరకు చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశారు. ఆర్థిక రంగంలో లిబరలైజేషన్ కు ఆయన అండగా నిలిచారు. ఫైనాన్స్ మినిస్టర్ గా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఆర్థిక మంత్రి హోదాలో  చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లకు అప్పట్లో  ‘ డ్రీమ్ బడ్జెట్ ’ లని పేరు. స్టాక్ మార్కెట్ కు ఇష్టమైన లీడర్ గా ఆయనకు పేరుండేది. గోధుమ, బియ్యం కు సంబంధించి ‘ఫ్యూచర్ ట్రేడింగ్’  పై ఆయన నిషేధం విధించారు. ఎగుమతులు తగ్గించుకోవలసిందిగా స్టీల్ ఇండస్ట్రీని ఆదేశించారు. అలాగే ధరలను తగ్గించుకోకపోతే జైల్లో పెడతానని సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ ను ఆయన హెచ్చరించి దార్లో పెట్టారు. టీ రేట్స్ ను కంట్రోల్ చేయడంలోనూ ఆయన ధైర్యం చూపారని బిజినెస్ సర్కిల్స్ అంటాయి. ఈ విషయంలో  శ్రీలంక ప్రభుత్వం పై ఆయన ఒత్తిడి తీసుకువచ్చి సక్సెస్ అయ్యారని మార్కెట్ వర్గాలు గుర్తు చేసుకుంటాయి. చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఐఎన్ ఎక్స్ ఇష్యూ జరిగింది. ఈ మీడియా కంపెనీకి ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో  చిదంబరం మేలు చేకూర్చారని, దానికి బదులుగా కొడుకు కార్తి ద్వారా చిదంబరానికి ముడుపులు అందాయని ఆరోపణలు వచ్చాయి. ఇది 2007 నాటి కేసు. అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఎఫ్ ఐ ఆర్ దాఖలైంది. అయితే అప్పటి నుంచే చిదంబరం కోర్టుల్లో పోరాటం చేస్తూనే  ఉన్నారు. ఆయన కూడా లాయర్ కావడం వల్ల ఈ కేసు నుంచి బయటపడటానికి  ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీ హై కోర్టు, సుప్రీం కోర్టులలో కూడా బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు అరెస్టు కావలసి వచ్చింది. మామూలుగా హుందాగా అరెస్టు అయితే బావుండేది కానీ, ఎవరికీ రెండు రోజుల పాటు కనపడకపోవడం, అలాగే సీబీఐ అధికారులు వచ్చినప్పుడు ఇంటి తలుపులు తెరవకుండా మొరాయించడం చూస్తే , పెద్ద మనిషి తరహాగా ఉండే చిదంబరం ఇలా చేసేరేంటా అని ఆయన గురించి తెలిసిన వాళ్లు అనుకోవడం సహజమే. కేసుతో తనకే మాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ ఆఫీస్ లో  ప్రెస్ మీట్ చెప్పిన చిదంబరం, కొన్ని గంటల తర్వాత అరెస్టు కాకుండా సీబీఐ వాళ్లను చికాకు పెట్టడం చూస్తే ఆయన కేసు విషయంలో భయపడుతున్నారా అని అనిపించక మానదు. ఇంతకీ ఐఎన్ ఎక్స్ మీడియా కేసుతో  చిదంబరానికి ప్రమేయం ఉందా ? లేదా ? అనేది  ప్రస్తుతానికి చిదంబర రహస్యమే.

యూపీఏ ప్రభుత్వంలో  కీలక మంత్రి గా..

2004 లో ఏర్పడిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ గా చేరారు. కొంతకాలం ఆ పదవిలో కొనసాగారు. 2009లోనూ రెండోసారి యూపీఏ ప్రభుత్వమే ఏర్పడింది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అవడంతో ఆయన ప్లేస్ లో చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. ఈ ప్రభుత్వం పదవీకాలం ముగిసేవరకు చిదంబరం కేంద్ర మంత్రిగా కొనసాగారు. పదేళ్ల పాటు హోం, ఆర్థిక శాఖ తో పాటు మరికొన్ని శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశారు. కామర్స్ మినిస్టర్ గా దేశ ఎగుమతులు, దిగుమతుల (ఎగ్జిమ్) పాలసీకి సంబంధించి  అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఐఎన్ఎక్స్ కేసు కథేంటి?

ఇది 2007 నాటి కేసు. ఐఎన్ ఎక్స్ అనేది ఓ మీడియా కంపెనీ. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ కంపెనీకి పెట్టుబడులు ఇవ్వడానికి ‘ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ’ ( ఎఫ్ ఐపీబీ) అనేక అవకతవకలకు పాల్పడిందన్న ప్రధాన ఆరోపణ. ఐఎన్ ఎక్స్ మీడియా సంస్థకు రూ.305 కోట్ల మేర లాభం జరిగే ఈ పనికి  ‘ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ’ మాత్రమే ఆమోదం చెప్పాల్సి ఉంది. అయితే ఐఎన్ ఎక్స్ విషయంలో చిదంబరం రూల్స్ ను పక్కన పెట్టారు. ‘ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)’ ద్వారా అమోదం వచ్చేలా కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం తమ పరపతి ఉపయోగించారన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఈ అక్రమాల ఫలితంగా చిదంబరం కుమారుడు కార్తికి కోట్ల రూపాయల లాభం జరిగిందన్నది మరో ఆరోపణ. పదేళ్ల తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఈ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. 2017 లో ఐఎన్ ఎక్స్ అక్రమాలకు సంబంధించి   సీబీఐ ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ ( ఎఫ్ ఐ ఆర్ ) నమోదు చేసింది. 2018 లో ఈ అవకతవకలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) మనీ లాండరింగ్ కేసు ఫైల్ చేసింది. ఈ పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తులో భాగంగా తనను అరెస్టు చేయకుండా చిదంబరం 2018 మే 30న ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తోన్న మనీ లాండరింగ్ కేసు కు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అదే ఏడాది జులై 23న ఢిల్లీ హై కోర్టులో మరో పిటీషన్ వేశారు. అయితే ఈ రెండు కేసుల్లో చిదంబరం వేసిన పిటీషన్లపై  2019 జనవరి 25న ఢిల్లీ హై కోర్టు తీర్పు ను రిజర్వ్ చేసింది.  తర్వాత అదే ఏడాది ఆగస్టు 20న రెండు కేసులకు సంబంధించి యాంటిసిపేటరీ  బెయిల్ కోసం వేసిన పిటీషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి  ఇండియా, బ్రిటన్, స్పెయిన్ లలోకి చిదంబరం కుమారుడు కార్తి కి చెందిన రూ. 54 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.

ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కేసు

ఇది కూడా చిదంబరం  ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పటి కేసే. మారిషస్ కు చెందిన మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోర్డింగ్ లిమిటెడ్, మన దేశంలోని ఎయిర్ సెల్ టెలి కమ్యూనికేషన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి రూల్స్ ను పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో రూ. 600 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు పర్మిషన్ ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ రూ. 3200 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు చిదంబరం అనుమతి ఇచ్చినట్లు పేర్కొంటూ సీబీఐ కేసు ఫైల్ చేసింది.

డిసెంబర్ 9 ప్రకటన చిదంబరానిదే

తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రి హోదాలో తొలి ప్రకటన చేసింది చిదంబరమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటూ 2009 డిసెంబర్ తొమ్మిదిన చిదంబరం ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రజల ఆనందం ఒక్క రోజు కూడా నిలవలేదు. చిదంబరం ప్రకటనకు  వ్యతిరేకంగా సీమాంధ్రలో అర్థరాత్రి నుంచే కుట్రలు  మొదలయ్యాయి. దీంతో భయపడ్డ  మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెలంగాణపై వెనక్కి పోయింది. ఈ పరిణామం పై తెలంగాణ సమాజం భగ్గున మండిపోయింది. తిరిగి తెలంగాణకు అనుకూలంగా 2014లో ప్రకటన వచ్చేంత వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించారు.

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అరెస్టయిన వారిలో గతంలో  చాలా మంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరిలో కొంతమందిని ఆ తర్వాత కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తే మరికొంతమందికి  శిక్ష పడింది.

లాలూ ప్రసాద్

కోట్లాది రూపాయల దాణా కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టు కాకుండా ఉండేందుకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2019 ఏప్రిల్​లో ఆయన బెయిల్ పిటీషన్​ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

జయలలిత

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసుకు సంబంధించి దివంగత అన్నాడీఎంకే చీఫ్ జయలలితను నాలుగేళ్ల పాటు జైల్లో పెట్టారు. వంద కోట్ల మేరకు జరిమానా కూడా జయ చెల్లించారు. ఇది 1996 నాటి కేసు. ఈ కేసుకు సంబంధించి జయలలిత తో పాటు ఆమె సహాయకురాలు శశికళకు కూడా కోర్టు శిక్ష విధించింది.  బెంగళూరు సెంట్రల్ జైల్లో 21 రోజులు గడిపిన తర్వాత జయలలితకు బెయిల్ లభించింది.

అమర్ సింగ్

క్యాష్ ఫర్ ఓట్ స్కాంకు సంబంధించి అప్పటి సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్​ను అరెస్టు చేశారు. 2011సెప్టెంబర్​లో ఆయనను 13 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

కనిమొళి

2 జీ కుంభకోణంలోనే డీఎంకే లీడర్ కనిమొళి అరెస్టయ్యారు. ఈ స్కాంకు సంబంధించి 2011 మే 21 నుంచి 2011 నవంబరు 28 వరకు ఆమె జైల్లో  ఉన్నారు. కుంభకోణంతో ఆమెకు సంబంధం లేదని 2017లో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది.

యడియూరప్ప

ప్రభుత్వ భూమి డీ నోటిఫై చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 2011 అక్టోబరులో బీఎస్ యడియూరప్పను ప్రత్యేక లోకాయుక్త జైల్లో పెట్టింది. 25 రోజులు జైల్లో గడిపిన తర్వాత కోర్టు ఆయనను విడుదల చేసింది. అలాగే బళ్లారి ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరపడానికి సహకరించారన్న ఆరోపణలు ఆయన పై వచ్చాయి.

సురేశ్ కల్మాడీ

కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణానికి సంబంధించి ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓసీ)’ మాజీ ప్రెసిడెంట్ సురేశ్ కల్మాడీని 2011 ఏప్రిల్ లో అరెస్టు చేశారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో తొమ్మిది నెలల పాటు ఆయనను ఉంచారు. తర్వాత 2012లో ఆయనను విడుదల చేశారు.

ఏ రాజా

రాజకీయాల్లో పెను దుమారం రేపిన 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి  సంబంధించి టెలికం మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ ఏ. రాజాను 2011 ఫిబ్రవరి 2న పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఆయన గడిపారు. తర్వాత 2012 మే 12న ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే 2017 లో 2 జీ స్పెక్ట్రమ్ స్కాంలో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు విడుదల చేసింది.

అప్రూవర్ గా మారిన ఇంద్రాణీ ముఖర్జీ 

ఐఎన్ ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ అప్రూవర్లుగా మారడంతో చిదంబరం అరెస్టు కు రూట్ క్లియర్ అయిందని భావిస్తున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వీరిద్దరూ కేసుకు సంబంధించి అనేక ముఖ్యమైన వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. చిదంబరం మెడ పై మరికొన్ని కేసులు వేలాడుతున్నాయి. వీటిలో ఎయిర్  సెల్ మ్యాక్సిస్ కేసు ముఖ్యమైనది.