బెర్లిన్‌ గోడ స్మారకాన్ని సందర్శించిన జస్టిస్‌ ఎన్వీ రమణ

బెర్లిన్‌ గోడ స్మారకాన్ని సందర్శించిన జస్టిస్‌ ఎన్వీ రమణ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆయన సతీమణి శివమాలతో కలిసి జర్మనీ పర్యటనలో బెర్లిన్​గోడ స్మారకాన్ని సందర్శించారు. రెండో ప్రపంచయుద్ధం, తూర్పు-పశ్చిమాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత జర్మనీ విభజనకు ఈ బెర్లిన్‌ గోడ అంతర్జాతీయ చిహ్నంగా మిగిలింది. దీన్ని 1961 ఆగస్టు 13న నిర్మించారు.

1949 నుంచి 1961 మధ్యలో 25 లక్షల మంది తూర్పు జర్మన్లు పశ్చిమ జర్మనీకి పారిపోయారు. ఆ సంఖ్య క్రమంగా పెరగడం వల్ల నైపుణ్యం ఉన్న కార్మికులు, వృత్తి నిపుణులు, మేధావులు వలసపోయి తూర్పు జర్మనీ ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితులు కనిపించడంతో అక్కడి పాలకులు తూర్పు జర్మనీకి మిగతా జర్మన్‌ భూభాగంతో రాకపోకలు జరగకుండా చేయడానికి బెర్లిన్‌ గోడను నిర్మించారు. కాందిశీకుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి, తనిఖీలు లేకుండా సరిహద్దులు దాటడానికి వీల్లేకుండా చేయడానికి ఈ గోడను నిర్మించారు.