
- నిర్మల్ జిల్లా కుభీర్ మండలం కస్ర అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన
కుభీర్, వెలుగు : అంగన్‌వాడీ కేంద్రంలో ఫ్యాన్ ఊడి పడి ఓ చిన్నారికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కస్ర గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం పిల్లలు చదువుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఫ్యాన్ ఊడి విరాజ్ అనే మూడేండ్ల చిన్నారి తలపై పడింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందించారు.
ఘటన జరిగిన టైంలో అంగన్‌వాడీ టీచర్ లేకపోవడంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బుధవారం గ్రామానికి వెళ్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం చిన్నారిని పరామర్శించి, అతడి తల్లిదండ్రులతో మాట్లాడారు. చిన్నారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అనంతరం ఐసీడీఎస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, కరెంటు బోర్డుల పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.