బాలకార్మిక వ్యవస్థ పోయేదెన్నడు?

బాలకార్మిక వ్యవస్థ పోయేదెన్నడు?

చదువు లేదు. ఆట పాటలు లేవు. సరైన పోషకాహారం అందదు. కానీ, ఆ లేలేత చేతులు రాళ్లు కొడుతున్నాయి. పాలుగారే వయస్సు ప్రమాదకర పరిస్థితుల్లో పరిశ్రమల్లో పనిచేస్తోంది. పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బీడీలు చుడుతోంది. బట్టిల్లో బండ చాకిరికి బలైపోతోంది. మధురమైన బాల్యం మళ్లీ చిగురించాలన్న కోరిక వారిలో అడుగంటిపోయింది. చేదు అనుభవాలతో మనిషంటే అసహ్యమేస్తోంది. పొలాలు, గనులు, కార్ఖానాల్లో రెక్కలు ముక్కలు చేసుకునే దుస్థితి.  

ప్రపంచంలో సుమారు 16.8 కోట్లమంది బాల కార్మికులు ఉండగా, ప్రతి పది మంది బాలల్లో ఒకరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నట్లేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో) అంచనా వేసింది. ప్రపంచంలో సుమారు 3.6 కోట్ల మంది పిల్లలు బానిస బతుకులు వెళ్లదీస్తున్నారని ఆస్ట్రేలియాకు చెందిన మానవ హక్కుల బృందం ‘ద వాక్ ఫ్రీ ఫౌండేషన్’ నివేదికలో పేర్కొంది.

ప్ర పంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా బాలకార్మిక వ్యవస్థ మాత్రం సమాజాన్ని వదిలిపోవడం లేదు. పేదరికం, నిరక్షరాస్యత, అక్రమ రవాణా తదితరాల వల్ల ఎంతోమంది పిల్లలు బాలకార్మికులుగా మగ్గిపోతున్నారు. వారు తీవ్రమైన దోపిడీకి, దౌర్జన్యాలకు గురవుతున్నారు. బాలకార్మిక వ్యవస్థ వల్ల విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులు హరించుకుపోతున్నాయి. 

బాల కార్మికులు లైంగిక, ఆర్థిక దోపిడులకు గురవుతున్నారు. వలస, శరణార్థి బాలల విషయంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో) కృషి చేస్తోంది. ప్రపంచ దేశాల్లో చోటుచేసుకునే వివిధ బాల కార్మిక సమస్యల పరిష్కారానికి 137 సభ్య దేశాలున్న ఐఎల్వో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ముందుకు సాగుతోంది. ప్రపంచలో అత్యధిక జనాభా కలిగిన మనదేశంలో బాల కార్మికులు కూడా ఎక్కువే. దేశ శ్రామిక శక్తిలో 3.1 కోట్ల మంది బాలలు ఉన్నారు. 

పెరుగుతున్న బాలకార్మికుల శాతం

ప్రతి 11 మంది పిల్లల్లో ఒకరు పనిలో కొనసాగుతున్నారు. ఐఎల్వో నివేదిక ప్రకారం మనదేశంలో 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సులో 1.01 కోట్ల మంది బాలలు పనుల్లో కొనసాగుతున్నారు. అదే వయసు వారిలో సుమారు 4.27 కోట్ల మంది పిల్లలు బడి బయట ఉన్నారు. బాలకార్మిక శ్రామికశక్తిలో 14-–17 ఏళ్ల మధ్య వయస్సు వారు సుమారు 63 శాతం ఉన్నారని 'సేవ్ ది చిల్డ్రన్' సంస్థ తెలిపింది. బాలికల కంటే బాలురే ఎక్కువగా ప్రమాదకర పనుల్లో కొనసాగుతున్నారు. యునిసెఫ్ నివేదిక ప్రకారం పట్టణీకరణ ప్రాంతాల్లో 5 నుంచి 14 ఏళ్ల వయసులోని బాలకార్మికుల్లో 54 శాతం పెరుగుదల కనిపించింది. 

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో బాలకార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొవిడ్ సమయంలో 2020 నుంచి 2022 మధ్య అత్యధిక బాల కార్మిక కేసులు తెలంగాణలో నమోదయ్యాయని కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే తెలిపారు. భారత రాజ్యాంగంలోని 24, 39, 45 అధికరణలు పిల్లలను శ్రమదోపిడీ నుంచే కాకుండా ఇతర రక్షణలు కల్పిస్తున్నాయి.  ఆర్టికల్​24 ప్రకారం 6-–14 ఏళ్ల వయస్సులోపు బాల, బాలికలను ప్రమాదకర, ఇతర పనుల్లో వినియోగించకూడదు. 

ఆర్టికల్​39 ప్రకారం బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు ఆటంకంగా ఉండే పరిస్థితులను తొలగించాలి. వారు సాంఘిక నేరాలకు, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలి. ఆర్టికల్​ 45 ప్రకారం 6 ఏళ్లలోపు బాల బాలికలు అందరికీ సంరక్షణ, ఉచిత విద్య సదుపాయాలు కల్పించాలి. ఈమేరకు ఏర్పాటైన 1974 జాతీయ బాలల విధానం ప్రకారం బాలలకు అన్ని విధాల రక్షణ, హక్కులను కాపాడాలి. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక జాతీయ కమిషను కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికులు

ఇదిలావుండగా, 1986లో కేంద్ర ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం నోటిఫై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికులు ఉండకూడదు. ఈమేరకు 18 ప్రమాదకర వృత్తులు, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సుగల బాలబాలికలు హానికరమైన పనులు చేయడం నిషేధం.  విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఈ వయస్సు పిల్లలు బడి బయట ఉండకూడదు. 

బాలకార్మిక చట్టానికి, విద్యాహక్కు చట్టానికి మధ్య పొంతన కుదరకపోవడంంతో, కేంద్ర మంత్రిమండలి బాలకార్మిక చట్టం-1986కు సవరణ చేసింది. దీని ప్రకారం 14 ఏళ్ల లోపు  బాల బాలికలను ఎలాంటి పనుల్లోనూ చేర్పించరాదు. బాధ్యతగా వారు బడికి వెళ్ళి చదువుకోవాలి. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న అంతర్జాతీయ సమాజ లక్ష్యాన్ని చేరుకోవడం మన దేశానికి ఆచరణ సాధ్యం కాదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 52వ నివేదికలో స్పష్టం చేసింది. 

ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న బాలకార్మికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్దారణకు వచ్చింది. చిన్నారులను బలవంతంగా పనిలో దింపడాన్ని బాలల అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పిల్లలకు విముక్తి కలిగించడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 'ఆపరేషన్ స్మైల్', 'ఆపరేషన్ ముస్కాన్' పేర్లతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది.  

చిన్నారుల స్వేచ్ఛను కాపాడాలి

పోలీసులు నిఘా వేసి పిల్లలను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితం అందిరావడం లేదు. పిల్లలు తిరిగి మళ్లీ పనుల్లో చేరడం మామూలైంది. చిన్నారుల స్వేచ్ఛను, హక్కులను బాలకార్మిక వ్యవస్థ హరిస్తోంది. చదువుకు దూరమై కూలీలుగా కొనసాగడంవల్ల వారి జీవితాలపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం పడుతోంది. పేదరికానికి దారితీసే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. 

బాలకార్మిక నిరోధ చట్టాలు, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం వంటి చర్యల కారణంగా బాలకార్మికుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, కొవిడ్ కారణంగా ఈ సంఖ్య మళ్లీ పెరిగింది. డా.శాంతాసిన్హా వ్యవస్థాపకురాలిగా ఉన్న ఎం.వి.ఫౌండేషన్ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ ప్రాంతాల్లో పనిచేస్తూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడుతున్నాయి. కల్లాకపటం తెలియని చిన్నారులకు కష్టాలు కన్నీళ్లను రుచి చూపించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. చిన్నారుల స్వేచ్ఛను కాపాడాలి.  బడి ఈడు పిల్లలందరికీ స్వేచ్ఛగా జీవించే భరోసా అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

- కోడం పవన్​కుమార్,సీనియర్​ జర్నలిస్ట్​-