
అమెరికాలో చాలా మంది ఇండియన్లు హెచ్1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్నారు. గ్రీన్‌కార్డు కోసం ఏళ్లతరబడి వేచి చూస్తున్నా అవకాశం కొంత మందికే దక్కుతోంది. అయితే, ఇప్పుడు హెచ్1బీ వీసా హోల్డర్ల పిల్లలకు ఓ కొత్త కష్టం వచ్చి పడింది. ఇన్నాళ్లూ డిపెండెంట్ (హెచ్4) వీసాపైనే ఉంటున్న వారి పిల్లలు (ఇండియాలో పుట్టి తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లినవారు), ఇకపై స్టూడెంట్ వీసా (ఎఫ్1) తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే స్వచ్ఛందంగా అమెరికా నుంచి ఇండియాకు వచ్చేయాలి. అవును, ఇటీవల అమెరికా కాంగ్రెస్‌లో దేశాలకు ఇచ్చే గ్రీన్‌కార్డ్ లిమిట్‌ను ఎత్తేసేందుకు రెండు బిల్లులను పెట్టారు. అయితే, అందులో ఒక బిల్లును సెనేట్ తిరస్కరించింది. దీంతో లిమిట్‌ను ఎత్తేస్తారని ఆశలు పెట్టుకున్న చాలా మంది ఇండియన్లు నిరాశపడుతున్నారు. అంతేకాదు, ఇకపై 21 ఏళ్లు నిండిన లేదా నిండబోతున్న వాళ్లందరి పిల్లలు ఎఫ్1 వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టూడెంట్ వీసా వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. వీసా రాకపోతే అమెరికాను విడిచి పెట్టి వెళ్లి పోవాల్సి ఉంటుంది. అయితే, హెచ్1బీ వీసా హోల్డర్లకు అమెరికాలోనే పిల్లలు పుడితే వాళ్లకు మాత్రం దీని నుంచి మినహాయింపుంది. కారణం, అక్కడ పుట్టిన వారికి పౌరసత్వం వస్తుంది. దానినీ ఎత్తేయాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే.
ఇండియన్లకే వెయిటింగ్ ఎక్కువ
ఏటా హెచ్1బీ (ఉద్యోగాధారిత) వీసా ఉన్న వారి కోసం అమెరికా ఏటా 1.4 లక్షల గ్రీన్‌కార్డులను ఇస్తుంది. అందులో ఒక్కో దేశానికి 7శాతం పరిమితి పెట్టింది. అయితే, అమెరికాకు వెళుతున్న వారి జాబితాలో ఇండియన్లే ఎక్కువగా ఉంటున్నారు. దాని వల్ల దేశానికి 7 శాతం పరిమితి ఉండడంతో చాలా మంది ఇండియన్లు గ్రీన్‌కార్డు కోసం వేచి చూడాల్సి వస్తోంది. ‘‘వేరే దేశాలకు చెందిన జనానికన్నా చాలా మంది ఇండియన్లు గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. హెచ్1బీ వీసాపై ఉంటున్న చాలా దేశాల ప్రజలకు దాదాపు ఆరేళ్లలోపే గ్రీన్‌కార్డు వస్తోంది. ఇండియన్లకు కనీసం పదేళ్లు పడుతోంది” అని న్యూయార్క్‌లోని ఇమిగ్రేషన్ సంస్థ ఫౌండర్ సైరస్ మెహతా చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నాటికి 6.32 లక్షల మంది (భార్యలు, 21 ఏళ్లలోపున్న వారి పిల్లలు సహా) ఇండియన్లు గ్రీన్‌కార్డు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. గ్రీన్‌కార్డు బ్యాక్లాగ్ వెయిటింగ్ లిస్టులో ఇండియన్ల వాటానే 76 శాతం. దాన్ని బట్టి మనోళ్లు గ్రీన్‌కార్డుల కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈబీ2, ఈబీ3 బిజినెస్ వీసాలపై అమెరికా వెళ్లిన ఇండియన్లూ గ్రీన్‌కార్డు కోసం 50 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వస్తోందని కాటో అనే అమెరికా మేధో సంస్థ పేర్కొంది. అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన పిల్లలు అక్కడే పెరిగి పెద్దైతే వారిని డ్రీమర్లు అంటారు. ఇప్పుడు 21 ఏళ్లు నిండిన హెచ్1బీ వీసా హోల్డర్ల పిల్లలను హెచ్4 డ్రీమర్లు అని పిలుస్తున్నారు. వీసా రాకపోతే సొంత దేశానికి పోకుండా అక్కడే ఉండే వారికి ఆ పేరు పెట్టారు.