పిల్లలు తాము చూసిన ప్రతి అంశం గూర్చి తెలుసుకోవాలనే ఉత్సుకతతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, ఉపాధ్యాయులను ప్రశ్నల వర్షంలో ముంచేస్తారు. ఆకులు పచ్చగానే ఎందుకు ఉన్నాయి ? వంటింటిలోని ప్రెషర్ కుక్కర్ విజిల్ మోత ఎందుకు చేస్తోంది ? పసుపును, సున్నాన్ని కలిపితే ఎర్రని ద్రవం ఎందుకు వచ్చింది ? సోడా సీసా మూత తీయగానే బుస్సుమని నురగలతో కూడిన ద్రవం ఎందుకు వస్తుంది ? దెబ్బ తగిలి రక్తం కారినపుడు అమ్మ పసుపు పూసి గుడ్డతో ఎందుకు కడుతుంది ? ఇలాంటి నిత్యం తాను చూసే ప్రతి విషయం గూర్చి తెలుసుకోవాలనే తపనతో పిల్లలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.
ఆపిల్ చెట్టుపై నుంచి కిందికే ఎందుకు పడింది అనే న్యూటన్ వేసిన ప్రశ్న, అలాగే నీటికి రంగు లేనప్పటికీ సముద్రజలం నీలి రంగులో, ఆకాశం కూడా నీలి రంగులో ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న సర్. సి. వి. రామన్‌కు రావడం వల్లనే కదా గొప్ప వైజ్ఞానికశాస్త్ర ఆవిష్కరణకు దారి తీసాయని మనకు తెలుసు. నిజానికి ప్రశ్నించే తత్వమే సృజనకు, ఆవిష్కరణలకు, వైజ్ఞానిక, టెక్నాలజీ విషయ పరిజ్ఞాన విస్తృతికి పునాది అని తెలుసుకోవాలి.
పిల్లల్లో ప్రశ్నించే తత్వం ప్రయోజనాలు
ప్రశ్నించడమే తెలుసుకోవాలనే తపనను సూచిస్తుంది. ప్రశ్నించడం అనే పునాది మీదనే శాస్త్రసాంకేతిక అభివృద్ధికి మూలం. పిల్లలు ప్రశ్నలు అడిగితే విసుక్కోవడం, సమాధానం చెప్పకపోవడంతో వారిలో తెలుసుకోవాలనే జిజ్ఞాసను ఆదిలోనే తుంచేస్తున్నామని, అదే పిల్లలు ప్రశ్నించడం మానేస్తే అజ్ఞానాన్ని మోస్తూ కాలం గడుపుతారు. నిజానికి నేటి సమాజంలో ప్రశ్నించేవారిని అవిధేయులని, విప్లవకారులని, విసిగించేవారని ముద్ర వేస్తున్నది. పిల్లలు అడిగే ప్రతి అర్థవంతమైన ప్రశ్నకు నిదానంగా, ఓపికగా సమాధానాలు చెప్పడం ఇంట్లో తల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి.
అమ్మ నాన్నలు తమ పనుల్లో పడి పిల్లలు ప్రశ్నలు అడిగితే వెంటనే విసుక్కోవడం తరచుగా జరుగుతున్నది. సమాధానం తెలిస్తే వెంటనే చెప్పండి. తెలియకపోతే తెలుసుకొని సరైన సమాధానం చెప్పండి. అడిగే ప్రతి అర్థవంతమైన ప్రశ్నకు బహుమతి ఇవ్వండి. ఒక అంశం తెలియకపోతే వెంటనే ప్రశ్నలు అడిగేలా సిద్ధం చేయాలి. తెలియని విషయాన్ని ఇతరుల నుంచి సమాధానాలు పొందితే దినదినం విజ్ఞానం పెరుగుతుంది. ప్రశ్నించడం మానేస్తే అజ్ఞాన చీకట్లు జీవితాంతం మనతోనే వస్తాయి. నిజానికి ప్రశ్నించే నైపుణ్యం పిల్లల్లో ఉన్నట్లయితే ఆ చిన్నారుల్లో అభిజ్ఞ అభివృద్ది (కాగ్నిటివ్ డెవలప్‌మెంట్), క్రిటికల్ థింకింగ్, నేర్చుకోవాలనే తపన పెరగడం వల్ల విజ్ఞాన సముపార్జనకు రహదారులు పడతాయి.
- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
