నిద్రలో పిల్లలు ఉలిక్కిపడడానికి గల కారణాలు..!

నిద్రలో పిల్లలు ఉలిక్కిపడడానికి గల కారణాలు..!

కొందరు చిన్న పిల్లలు రాత్రిళ్లునిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటారు. హఠాత్తుగా లేచి ఏడుస్తుంటారు. తల్లిదండ్రులు ఏమైందో అని భయపడతారు. నిద్ర చెడగొట్టారని పిల్లలను తిడతారు. కానీ పిల్లలు అలా నిద్రలో ఉలిక్కిపడటానికి, ఏడవటానికీ కారణాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు, పిల్లలు చెప్పిన మాట వినడంలేదని కోప్పడతారు, దొంగలకు పట్టిస్తామని చెప్తారు. బూచోడువస్తాడు ఎత్తుకుపోతాడని భయపెడతారు. తిడతారు, ఒక్కోసారి కొడతారు కూడా. పిల్లలను నిద్రపుచ్చడానికి కథలు చెప్తారు. ఆ కథల్లో దెయ్యాలు, భూతాలు ఉండొచ్చు. అలాగే పిల్లలు ఆడే వీడియో గేమ్స్‌ కూడా వాళ్ల మనసులపై ప్రభావం చూపుతాయి. అవన్నీ పిల్లల మెదడుపై బలంగా ముద్ర వేస్తాయి.

తల్లిదండ్రులు చెప్పిన మాటల నుంచి అనేక ఊహలు చేస్తారు. అవన్నీ వాళ్లకు కలల రూపంలో వస్తాయి. దాంతో భయపడి నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తారు. అలాంటప్పుడు పిల్లలను దగ్గరకు తీసుకుని సముదాయించాలి. వాళ్లు ఏం చెప్తారో వినాలి. ధైర్యం చెప్పాలి. మళ్లీ మెల్లగా నిద్రపుచ్చాలి. పిల్లలు నిద్రలో ఉలిక్కిపడకుండా ఉండాలంటే, పిల్లలకు భయం కలిగించే కథలు చెప్పకూడదు. క్రైమ్స్‌ తో కూడిన సినిమాలు, వీడియో గేమ్స్‌ కు దూరంగా ఉంచాలి. పిల్లలు పడుకున్నాక బెడ్‌ రూం లో లైట్లన్నీ ఆపేయడం కంటే తక్కువ వెలుతురు ఉండే లైట్లను ఆన్‌ చేసి ఉంచడం బెటర్‌.