మక్కల సాగు తగ్గె దాణాకు కరువొచ్చె

మక్కల సాగు తగ్గె దాణాకు కరువొచ్చె

మక్కల సాగు తగ్గె దాణాకు కరువొచ్చె
క్వింటాల్ కు రూ.2400 పెట్టినా దొరుకుతలే..

సిద్దిపేట, వెలుగు : సర్కారు ఆదేశాలతో రైతులు మక్కల సాగు తగ్గించడంతో రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమకు కావాల్సిన దాణాకు కరువొచ్చింది.  మక్కలు పండించి అంతో ఇంతో ఆదాయాన్ని పొందే రైతులు కూడా మార్కెట్​లో డిమాండ్ ఉన్న టైంలో పంట సాగు చేయక ఆదాయాన్ని కోల్పోయారు. ఇదివరకు చత్తీస్​గఢ్, బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి మక్కలు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు అక్కడ కూడా దొరక్కపోవడంతో పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో దాణా రేటు పెరిగి పౌల్ట్రీ పరిశ్రమ మనుగడకే ప్రమాదకరంగా మారింది. 

ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యామ్నాయ పంటలవైపు 
రాష్ట్ర అవసరాల కంటే ఎక్కువగా మక్కలు సాగుచేస్తున్నారని, ఇక్కడి కంటే బిహార్, చత్తీస్​గఢ్ ​రాష్ట్రాల్లో తక్కువకే మక్కలు దొరుకుతున్నాయని, ఆ పంట సాగు చేయవద్దని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో రాష్ట్రంలో లక్షల మంది రైతులు మొక్కజొన్న సాగు చేయడం బంద్​ చేశారు. తెలంగాణలో మక్క సగటు సాగు విస్తీర్ణం 14 లక్షల ఎకరాలు కాగా, ఈ యాసంగిలో కేవలం 5.36 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇందులో యాబై శాతానికి పైగా పచ్చి కంకులుగా అమ్ముకునేందుకే రైతులు ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాలోని గజ్వేల్ ప్రాంతంలో యాసంగి సీజన్ లో దాదాపు 25 వేల ఎకరాల్లో మొక్కొజొన్న సాగు చేయగా, వీటిలో ఎక్కువ భాగం పచ్చి కంకులను హైదరాబాద్ కు తరలించగా, మిగిలింది సీడ్ గా సాగు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్​లో మక్కలకు కరువొచ్చింది. ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలో రెండు సీజన్లలో వరి తరువాత మొక్కజొన్న సాగు సెకండ్​ప్లేస్​లో ఉండేది. కానీ, ప్రభుత్వ ఆదేశాలతో అది కాస్తా యాభై వేల ఎకరాలకు పడిపోయింది. గతంలో క్వింటాల్​మక్కలకు రూ.1870 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించినా సమీప రాష్ట్రాల్లో  1400లకే  దొరకడంతో పౌల్ర్టీ వ్యాపారులు అక్కడి నుంచే దిగుమతి చేసుకునేవారు.  

నిలిచిపోయిన మక్కల దిగుమతులు
బీహార్, చత్తీస్​గఢ్​తో పాటు ఇతర రాష్ట్రాల్లో మక్కలు తక్కువ ధరకు దొరుకుతుండడంతో వ్యాపారులు తమ పౌల్ర్టీకి అవసరమైన వాటిని దిగుమతి చేసుకునే వారు. అక్కడ ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో పాటు నాణ్యమైన మక్కలు దొరకడం లేదని మన రాష్ట్రంలో కొనాలని భావించారు. అయితే  ప్రభుత్వ ఆదేశాలతో రైతులు సాగు తగ్గించడంతో అనుకున్న స్థాయిలో మక్కలు దొరకడం లేదు. దీంతో అరకొరగా దొరికిన మక్కలకు ఎక్కువ డిమాండ్​ఏర్పడటంతో క్వింటాల్​కు రూ.2400 చెల్లించి కొంటున్నారు. అయినా ప్రస్తుత అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఎవరైనా రైతుల దగ్గర మక్కలు ఉన్నట్టు తెలియగానే పౌల్ట్రీ వ్యాపారులు వెళ్లి వారు చెప్పిన రేటుకే కొంటున్నారు.  

పెరిగిన దాణా ధరలు
మక్కలు దొరకకపోవడంతో ఆరు నెలల్లో కోళ్ల దాణా ‌ధర ఏకంగా  కిలోకు పది రూపాయలు పెరిగింది. ఆరు నెలల క్రితం రూ.17 కు కిలో ఉండగా, ఇప్పుడు రూ.28 కి చేరింది. దాణాను మక్కలు, చేపపొట్టు, సోయా, బియ్యం పరం కలిపి తయారు చేస్తారు. మక్కల ధర పెరగడంతో దాణాలో కలిపే ఇతర వస్తువుల రేట్లను పెంచడం పౌల్ట్రీ పరిశ్రమకు ఇబ్బందికరంగా మారింది. ఏడాది క్రితం వరకు సిద్దిపేట జిల్లాలో ఆరు లక్షల కెపాసిటీ కలిగిన 16  పౌల్ర్టీ బ్రీడర్‌ ఫామ్‌‌‌లు,  40 లక్షల సామర్థ్యం కలిగిన 70 లేయర్‌‌ఫామ్స్, 15 లక్షల సామర్థ్యం కలిగిన 250  బ్రాయిలర్‌‌‌ఫామ్స్ ఉండగా ప్రస్తుతం లేయర్ ఫామ్స్ సంఖ్య 40కి పడిపోయింది. అలాగే దాణాతో పాటు ఇతర సమస్యల కారణంగా అనేక మంది వ్యాపారులు ఫామ్స్ మూసుకున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు జిల్లాలో ప్రతిరోజు దాదాపు 50 లక్షల పై చిలుకు గుడ్ల ఉత్పత్తి జరిగేది. ప్రస్తుతం ఫీడ్ రేట్​పెరగడం, గుడ్డు రేటు తగ్గడంతో చాలా వరకు నష్టాల్లోకి వెళ్లిపోయామని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.

మక్కలు సాగుచేసి ఉంటే...
ప్రతిసారి నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న వేసేవాడిని. కానీ, గత ఏడాది నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్నామ్నాయంగా పత్తి సాగు చేస్తున్నా. అయితే ఈసారి మక్కలకు మార్కెట్​లో మంచి ధర ఉండటంతో గుండె తరుక్కుపోతోంది. ఇప్పుడు మక్కలు చేతిలో ఉంటే మంచి ఆదాయం వచ్చేది. సర్కారు సూచనలు పాటించినందుకు అనేక మంది రైతులు ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.  
–  కాయితి రాజ ,  రైతు, అనంతగిరిపల్లి

పౌల్ట్రీ పరిశ్రమ పై ప్రభావం  
మక్కల కొరతతో పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన దాణా ధరలు పెరిగాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో తక్కువకే దొరుకుతున్నాయని కొనేవాళ్లం. అయితే ప్రస్తుతం అక్కడ కూడా దొరకడం లేదు. మన రాష్ట్రంలో సాగు లేక క్వింటాల్​కు రూ.2400 పెడదామన్నా లభించడం లేదు. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. ఇవి పౌల్ట్రీ పరిశ్రమ మనుగడకే ప్రమాదకరంగా మారాయి.  
– గంప శ్రీనివాస్‌‌, నెక్‌‌ హైదరాబాద్‌‌ జోన్‌‌ చైర్మన్‌‌