కరోనాతో అనాథలైన పిల్లల బాధ్యత ప్రభుత్వాలదే

కరోనాతో అనాథలైన పిల్లల బాధ్యత ప్రభుత్వాలదే

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఎన్నో జీవితాలను నాశనం చేసిందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వైరస్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితి దయనీయంగా ఉందంది. అయితే అలాంటి చిన్నారుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు.. చిన్నారులను గుర్తించే విధానం వాళ్లకు మేలు చేసేలా ఉన్నాయని చెప్పింది. ఆ పిల్లలకు అవసరమైన అన్ని వసతులను కల్పించాలని కేంద్ర, రాష్ట్రాలకు సూచించింది. పిల్లల సంరక్షణ కేంద్రాలపై కరోనా పంజా అంశాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను గుర్తించే ప్రక్రియను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు వేగవంతం చేయాలని కోర్టు చెప్పింది. పథకాలకు సంబంధించిన అన్ని బెనిఫిట్స్‌ వాళ్లకు చేరేలా చర్యలు తీసుకోవాలంది. దేశంలో చిన్నారులందరికీ ఫ్రీగా విద్యను అందించాలని రాజ్యాంగం చెబుతోందని, ఆ ప్రకారం అందరికీ చదువు అందించేలా రాష్ట్రాలు పని చేయాలని చెప్పింది. అర్హులైన 18 ఏండ్లలోపు పిల్లలకు పీఎం కేర్స్‌ ద్వారా చదువు చెప్పించాలంది.

ఫీజు మాఫీపై ప్రైవేటు స్కూళ్లతో మాట్లాడండి

కరోనా వల్ల అనాథలైన 2,600 మంది పిల్లల వివరా లను రాష్ట్రాలు అందించాయని, వీటిల్లో 418 అప్లికేషన్లను జిల్లా మేజిస్ట్రేట్లు ఓకే చేశారని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాతి కోర్టుకు చెప్పారు. స్పందించిన కోర్టు మిగతా వాళ్ల అప్లికేషన్ల ప్రాసెస్‌ కూడా పూర్తిచేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. పోయినేడాది మార్చి తర్వాత కరోనాతో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు సంబంధించిన స్కూలు ఫీజులను మాఫీ చేసేలా ప్రైవేటు స్కూళ్లతో మాట్లాడాలని, ఒకవేళ మేనేజ్​మెంట్లు ఒప్పుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే  ఆ ఫీజులు చెల్లించాలంది. తర్వాతి విచారణను కోర్టు అక్టోబర్‌ 7కు వాయిదా వేసింది. బాల్​స్వరాజ్‌ పోర్టల్‌లో ఇన్ఫర్మేషన్‌ ప్రకారం పోయినేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 23 వరకు కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 8,161 మంది ఉన్నారు. తల్లి లేదా తండ్రిని కోల్పోయినోళ్లు 92,475 మంది ఉన్నారు. 396 మంది పిల్లలను వదిలేశారు.