- సగటు సబ్‌స్క్రిప్షన్ 17.7 రెట్లు
- భారీగా సంస్థాగత పెట్టుబడులు
ముంబై: సాధారణంగా పెద్ద ఐపీఓలపై ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపరు. 2025లో ఈ పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. పెద్ద ఐపీఓలకు కూడా బలమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ సంవత్సరం రూ. ఐదువేల కోట్లపైబడిన ఐపీఓలు సగటున 17.7 రెట్ల సబ్‌స్క్రిప్షన్ సాధించాయి. ఇది 2021 తర్వాత అత్యధికం. గత సంవత్సరాల సగటు 8–-10 రెట్లు కంటే చాలా ఎక్కువ.
ఈ సంవత్సరం వచ్చిన ఆరు పెద్ద ఐపీఓలలో, నాలుగు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఇవి రెండంకెల సబ్‌స్క్రిప్షన్ సాధించాయి. వాటిలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ (38.17 రెట్లు), లెన్స్‌కార్ట్ (28.35 రెట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ , గ్రోవ్(ఒక్కొక్కటి 17.6 రెట్లు) ఉన్నాయి. హెక్సావేర్ టెక్నాలజీస్, టాటా క్యాపిటల్ వరుసగా 2.27 రెట్లు, 1.96 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి.
లిక్విడిటీ ఉన్న సంస్థాగత ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడం దీనికి కారణం. సబ్‌స్క్రిప్షన్లలో 75-–80 శాతం వరకు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వస్తోంది. ఈసారి టాటా క్యాపిటల్ హెచ్డీబీ వంటి పెద్ద ఐపీఓలలో కొన్ని ఇష్యూకు ముందుగానే అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ట్రేడయ్యాయి. దీనివల్ల కూడా ధరలు పెరుగుతాయి కాబట్టి బిడ్ వేయడానికి ఇన్వెస్టర్లు ముందుకు వస్తారు. 2025లో ఈ ఆరు పెద్ద కంపెనీల ఐపీఓలు దాదాపు రూ. 62 వేల కోట్లు సమీకరించాయి.
ఇప్పటి వరకు 84 ఐపీఓలు
ఈ ఏడాది 84 ఐపీఓలు మొత్తం రూ. 1.29 లక్షల కోట్లు సమీకరించాయి. ఐపీఓ మార్కెట్ ఎప్పుడూ బుల్ మార్కెట్‌కు నిదర్శనమని ఎనలిస్ట్ సిద్ధార్థ్ భమ్రే అన్నారు. వాల్యుయేషన్లు ఎక్కువగా ఉన్నప్పుడు లిక్విడిటీ ప్రైమరీ మార్కెట్ వైపు మారుతుందని వివరించారు. రిస్క్‌తో కూడిన వాటికంటే లాభదాయకమైన, నిరూపితమైన వ్యాపారాలను ఇన్వెస్టర్లు ఇష్టపడుతున్నారని మర్చంట్ బ్యాంకర్లు చెప్పారు. ఈ పెరుగుదలకు ఇన్వెస్టర్ల తెలివైన విధానం కారణమని తెలిపారు. వాళ్ల రిస్క్ సామర్థ్యం తగ్గలేదని, మరింత తెలివైనదిగా మారిందని అన్నారు.
ఏడు పేజీల్లోనే డీఆర్‌హెచ్‌పీ సారాంశం..
భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీఓ డిస్క్లోజర్ల విధానంలో భారీ మార్పులు ప్రతిపాదించింది. పెట్టుబడిదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఐపీఓ సమాచారాన్ని అందించాలని సెబీ యోచిస్తోంది. కంపెనీలు దాఖలు చేసే వందల పేజీల డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) లోని కీలక వివరాలను కేవలం ఏడు పేజీలకు కుదించాలని ప్రతిపాదించింది.
కంపెనీ ఆర్థిక స్థితి, వృద్ధి అవకాశాలు, లాభనష్టాలు సహా ఇతర ముఖ్యమైన అంశాలను మాత్రమే స్పష్టంగా తెలియజేయాలి. ఈ సరళీకృత విధానం వల్ల సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ కూడా కంపెనీ గురించి త్వరగా తెలుసుకుని, పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
