- నాగార్జునసాగర్ సర్కార్ దవాఖానలో ఘటన
హాలియా, వెలుగు: జ్వరంతో వచ్చిన పిల్లలకు యాంటీ బయోటిక్ ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా వారి పరిస్థితి సీరియస్‌గా మారింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లోని కమల నెహ్రూ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగింది.
నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లోని వివిధ తండాలు, గ్రామాలకు చెందిన సుమారు 17 మంది చిన్నారులు చలిజ్వరం, వాంతులతో శుక్రవారం రాత్రి 11 గంటలకు నాగార్జునసాగర్ కమల నెహ్రూ దవాఖానకు వచ్చారు. వారిని పరీక్షించిన వైద్య సిబ్బంది చలిజ్వరం, వాంతులను తగ్గించేందుకు మోనోసెఫ్(యాంటీ బయోటిక్) ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ ఇంజక్షన్ వికటించి కొద్దిసేపటికే చిన్నారులంతా అస్వస్థతకు గురయ్యారు. వారి తల్లిదండ్రులు వైద్య సిబ్బందితో గొడవకు దిగారు.
విషయం తెలుసుకున్న హాస్పిటల్ సూపరిండెంట్ భాను ప్రసాద్ నాయక్ వెంటనే డ్యూటీ డాక్టర్లను అప్రమత్తం చేశారు. మెరుగైన వైద్యం అందించడంతో చిన్నారుల కండిషన్ అదుపులోకి వచ్చింది. వారిని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఘటన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ హాస్పిటల్‌ను విజిట్ చేసి పిల్లల పరిస్థితిపై ఆరా తీశారు. పిల్లలకు ఇచ్చిన ఇంజక్షన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై కమిటీ వేసి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మెడిసిన్ సరిగ్గా వాడనందునే..
ఈ ఘటనపై హాస్పిటల్ సూపరింటెండెంట్ భానుప్రసాద్ నాయక్ స్పందించారు. వైరల్ ఫీవర్ వచ్చిన చిన్నారులకు ఏడు రోజులపాటు మెడిసిన్ వాడాల్సి ఉంటుందని, తల్లిదండ్రులు కోర్సు సరిగ్గా వాడనందునే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. వైద్య సిబ్బంది సకాలంలో మెరుగైన ట్రీట్మెంట్ అందించడంతో చిన్నారులు కోలుకున్నారని తెలిపారు.
