చిలుకలగుట్ట తొవ్వలోనే అసలు సిసలు జాతర

చిలుకలగుట్ట తొవ్వలోనే అసలు సిసలు జాతర
  • దారిపొడవునా రంగవల్లులు.. యాటపోతుల రక్తపుటేరులు
  • సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు రోమాలు నిక్కబొడుచుకునేలా యాటల బలి
  • పూనకాల్లో శివసత్తులు.. ఇసుక వేస్తే రాలనంత భక్తులు
  • రక్తాలు పారుతున్న తొవ్వ మీదుగా సమ్మక్కతల్లి ఆగమనం

వరంగల్‍(మేడారం), వెలుగు: మేడారం చిలుకలగుట్ట. జాతరలో అతి ప్రధాన ఘట్టమైన సమ్మక్కతల్లిని పూజారులు వనం నుంచి జనంలోకి తీసుకొచ్చే కొండాకోన ప్రాంతం. అమ్మవార్ల గద్దెల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గుట్టకు వెళ్లేదారిలో అడుగడుగునా రోమాలు నిక్కబొడుచుకునే గడియలు. రంగవల్లులు, పూనకాలతో ఊగిపోయే శివసత్తులు. వెంటవచ్చినోళ్ల చేతుల్లో బలి ఇవ్వడానికి సిద్ధంగా వేలాది యాటలు. అమ్మవారికి చుట్టూరా ఆదివాసీ, పూజరుల తుడుందెబ్బ సైన్యం. వారికి తోడుగా బ్లాక్​కమాండోస్ మాదిరి పోలీసోళ్ల మూడంచెల సెక్యూరిటీ. వేలాది మందిని కట్టడి చేసేలా బాహుబలి వంటి రోప్​పార్టీ టీమ్. దారికి ఇరువైపులా తల్లిని దర్శించుకున్న ఆనందంలో బోరున కన్నీరు కార్చే లక్షలాది మంది భక్తులు. సింపుల్‍గా చెప్పాలంటే అసలు సిసలు సమ్మక్క జాతరంతా చిలకలగుట్ట దారిలోనే..

తల్లి వచ్చే దారంతా రంగుల మయం

సమ్మక్క తల్లి రాక జాతరలోనే హైలైట్​అయింది. గురువారం పొద్దుగూకే సమయానికి అమ్మవారిని పూజరులు వారి సంప్రదాయం ప్రకారం గద్దెల మీదకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. చిలకలగుట్ట దారిలో మధ్యాహం నుంచే హడవుడి మొదలైంది. రెగ్యులర్​భక్తులతోపాటు వేలాది మంది హిజ్రాలు చిలకలగుట్ట దారికి చేరుకున్నారు. అమ్మవారికి స్వాగతం పలుకుతూ భక్తులు దారిపొడవునా రంగవల్లులు తీర్చిదిద్దారు. దీపాలు పెట్టారు. ఆ ముగ్గుల మీదుగానే మేడారం పూజరులు నడుచుకుంటూ వెళ్లారు.

‘జై సమ్మక్క తల్లి’ నినాదాలు

రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు నెలల ముందు నుంచే భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే సమ్మక్క తల్లి గద్దెల మీదకు వచ్చిన రోజే అసలైన మొక్కులుగా భావించేవారు లక్షల్లో ఉంటారు. వీరంతా ప్రధాన జాతర జరిగే మూణ్నాలుగు రోజులు మేడారంలోనే మకాం వేస్తారు. గురువారం సాయంత్రం 6.51 గంటలకు పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఊరేగింపుగా కిందకు తీసుకురాగా పోలీస్​అధికారులు ఏకే47తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

అంతే.. అప్పటికే రోడ్లపై సమ్మక్క కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భక్తులు ‘జై సమ్మక్క తల్లీ..’ అంటూ ఆకాశానికి చిల్లులు పడేలా నినదించారు. మంగళహారతులతో స్వాగతం పలికారు. నిమిషం ఆలస్యం చేయకుండా వేలాదిగా యాటపోతులు, కోళ్లను అమ్మవారు వచ్చే ప్రధాన దారిలో బలిచ్చి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తోవ మొత్తం రక్తపు మడుగును తలపించింది. ముగ్గులు రక్తంతో తడిశాయి. వాటి మీదుగానే పూజారుల బృందం సమ్మక్క తల్లిని గద్దెల మీదకు తీసుకొచ్చారు.