సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లపై చైనా కొత్త రూల్స్.. ఇష్టమెుచ్చినట్లు కంటెంట్ కుదరదు

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లపై చైనా కొత్త రూల్స్.. ఇష్టమెుచ్చినట్లు కంటెంట్ కుదరదు

చైనా ప్రభుత్వం ఇటీవల ఓ కొత్త రూల్ అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లు హెల్త్, లీగల్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి "సున్నితమైన" విషయాలపై మాట్లాడాలంటే తప్పనిసరిగా అధికారుల నుంచి ఆమోదించిన డిగ్రీ, ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ చూపించాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  కొత్త రూల్స్ అక్టోబర్ 25న అమలులోకి వచ్చాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు డౌయిన్ (TikTok చైనా వెర్షన్), బిలిబిలి, వీబో వంటి వాటిపై కొత్త రూల్స్ వర్తించనున్నట్లు తెలుస్తోంది. వీటిపై ఇన్ఫ్లూయెన్సర్లు అధికారిక అర్హతలు నిర్ధారించుకోవడంతో పాటు.. వారి వీడియోల్లో, పోస్టుల్లో పంచుకుంటున్న సమాచారం స‌రైన సోర్సెస్ నుంచి ఉందని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకా AI తో జనరేట్ చేసిన కంటెంట్‌ను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రజలకు తప్పుడు సమాచారం అందటాన్ని కట్టడి చేయటమే చైనా ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యంగా తెలుస్తోంది. 

అయితే మరోపక్క రాజకీయ విమర్శకులు దీనిని "ఆన్‌లైన్ స్వేచ్ఛపై అడ్డంకి"గా భావిస్తున్నారు. ఈ నియమం వల్ల స్వతంత్రత, విభిన్న  కోణాలపై చర్చలకు అడ్డుగా చెబుతున్నారు. Expertise అనే పదానికి నిర్వచనం స్పష్టంగా తెలియకపోవడంతో అధికారులకు ఎక్కువ పవర్స్  వస్తాయని కూడా విమర్శలు ఉన్నాయి. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి, సృష్టిని అడ్డుకోవటానికి చైనా ప్రభుత్వ నిర్ణయం సరైనదిగా మరికొందరు అభిప్రాయపడుతున్నారు.  

ఈ రూల్స్ క్రియేటివిటీని అడ్డుకుంటాయనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఈ కొత్త రూల్స్ 2027 నాటికి 480 బిలియన్ డాలర్లకు పెరుగనున్న ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ రంగంలో కీలక మార్పుగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.