- పదుల సంఖ్యలో గాయపడ్డ కార్మికులు
- షాంగ్సీ ప్రావిన్స్‌లో దారుణం.. వంద మంది గల్లంతు
- మైనింగ్ చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి
బీజింగ్: చైనాలో అత్యంత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో ఉన్న ఓ భూగర్భ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో లోపల పనిలో నిమగ్నమైన కార్మికులు 90 మంది చనిపోయారు. మరో 123 మంది తీవ్రంగా గాయపడగా.. రెస్క్యూ బృందాలు వారిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించాయి.
ఇందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని సమాచారం. మరికొంతమంది కార్మికులు గల్లంతయ్యారని, వారి కోసం రెస్క్యూ టీమ్ లు గాలిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ప్రమాదమని, మైనింగ్ చరిత్రలో జరిగిన దారుణమైన ప్రమాదాల్లో ఇదొకటని వివరించాయి. ప్రభుత్వ అనుబంధ మీడియా ‘షిన్హువా’ కథనం ప్రకారం.. షాంగ్సీ ప్రావిన్స్‌లోని లియుషెన్యు బొగ్గు గనిలో ప్రమాదం జరిగిన సమయంలో లోపల మొత్తం 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారిలో అత్యధికులను శనివారం ఉదయానికి సురక్షితంగా పైకి తీసుకువచ్చారు.
అయితే, గనిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయికి మించిపోవడంతో మృతుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, గల్లంతైన వారి కోసం శోధన చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే సదరు మైనింగ్ కంపెనీకి చెందిన ఒక బాధ్యుడిని చట్టప్రకారం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగింది?
బొగ్గు గనిలో కార్మికులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ స్థాయిలో గ్యాస్ పేలుడు సంభవించింది. దీంతో గనిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడున్న 247 మంది కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి గని లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీనివల్ల లోపల ఉన్నవారితో సంబంధాలు తెగిపోయి రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చైనా విపత్తు నిర్వహణ బృందాలు వందలాది మంది సిబ్బందితో రంగంలోకి దిగాయి.
రాత్రి వేళలోనే సహాయక చర్యలు ముమ్మరం చేసి కార్మికులను పైకి తీసుకువచ్చాయి. పేలుడు కారణంగా గని లోపల ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషవాయువులు భారీగా పేరుకుపోయాయి. ఈ విషవాయువులు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక విచారణలో గ్యాస్ లీకేజీని గుర్తించే అలారమ్ వ్యవస్థ పనిచేయకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, సదరు మైనింగ్ కంపెనీకి చెందిన ఒక ముఖ్య అధికారిని పోలీసులు చట్టప్రకారం అదుపులోకి తీసుకున్నారు.
