ఒకే రాకెట్​లో 41 ఉపగ్రహాలు.. చైనాలో రికార్డు

ఒకే రాకెట్​లో 41 ఉపగ్రహాలు.. చైనాలో రికార్డు

బీజింగ్: అంతరిక్ష ప్రయోగంలో చైనా తొలిసారిగా ఒకే రాకెట్​లో అత్యధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. ఒకే ప్రయోగంలో 41 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టి రికార్డు సృష్టించింది. ఈ రికార్డు చైనాకే పరిమితం. చైనా టైమ్​ ప్రకారం గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు (మన దేశంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు) షాంక్సి ప్రావిన్స్ లోని తయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో లాంగ్​ మార్చ్ రాకెట్ నింగికెగిరింది. తాజా ప్రయోగంతో లాంగ్ మార్చ్ రాకెట్ ప్రయోగాల సంఖ్య 476 కు చేరిందని వివరించారు. 

ఈ రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాలలో 36 ఉపగ్రహాలు రిమోట్ సెన్సింగ్​ ఉపగ్రహాలేనని తెలిపారు. వాణిజ్య సేవలు అందించేందుకు చైనా సొంతం గా తయారుచేసిన తొలి ఉపగ్రహమే జిలిన్.. 2015లో తయారు చేసిన ఈ ఉపగ్రహం బరువు దాదాపు 420 కిలోలు ఉండగా.. ప్రస్తుతం 22 కిలోలకు తగ్గించామని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. జిలిన్ సిరీస్ లో  ఇప్పటి వరకు 108  ఉపగ్రహాలను పంపించినట్లు తెలిపారు.