చైనా ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్ కేసు

చైనా ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్ కేసు

మరో ఐదుగురి అరెస్ట్ గేమింగ్‌‌ యాప్స్ బాధితులే నిందితులు
బాధితులను ట్రాప్ చేస్తున్న చైనీయులు
అకౌంట్లు, సిమ్‌‌ కార్డులు ఇస్తే 
60 వేల జీతం,10 % కమీషన్‌‌
ఖాతాల వివరాలు అందించిన కర్నూలుకు చెందిన నలుగురు

హైదరాబాద్‌‌ : చైనా ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫ్రాడ్‌‌ కేసులో సిటీ సైబర్ క్రైమ్  పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చైనా మాస్టర్ మైండ్‌‌తో క్రియేట్‌‌ అయిన గేమింగ్‌‌ యాప్స్‌‌ను ట్రేస్‌‌ చేస్తున్నారు. అందులో భాగంగా కర్నూల్‌‌కు చెందిన నలుగురు, ముంబైకి చెందిన ఒకరిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. గేమింగ్‌‌ యాప్‌‌ కేసుల్లో బాధితులుగా ఉన్న వాళ్లే నిందితులుగా గుర్తించారు. చైనా, కంబోడియా నుంచి ఆపరేట్‌‌ అవుతున్న చైనా ఇన్వెస్ట్‌‌మెంట్ల మోసం సంగతి తెలిసిందే. ఫారెన్‌‌ మనీ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ ఎక్స్‌‌చేంజ్‌‌ ద్వారా రూ.903 కోట్లను సైబర్ నేరస్థులు తమ అకౌంట్లలో డైవర్ట్‌‌ చేసుకున్నారు. ఈ కేసులో చైనాకు చెందిన లి జహానౌ, తైవాన్‌‌కు చెందిన చున్‌‌చున్‌‌ యూను ఈ నెల 12 సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. నిందితుల వాట్సాప్‌‌ కోడింగ్‌‌, కొరియర్‌‌‌‌ సర్వీసెస్‌‌ ఆధారంగా దర్యాప్తు చేశారు. గేమింగ్‌‌ యాప్స్‌‌ సాయంతో నేరాలు చేసినట్లు గుర్తించారు.

హైదరాబాద్ బాధితుడి ఫిర్యాదుతో..

చైనాకు చెందిన అలెన్‌‌.ఫిలిప్పీన్స్‌‌లో ‘ఐపీఎల్‌‌ విన్‌‌’ పేరుతో గేమింగ్‌‌ యాప్‌‌ క్రియేట్‌‌ చేశాడు. ఆన్‌‌లైన్ లో లింకులు సర్క్యులేట్‌‌ చేశాడు. హైదరాబాద్‌‌కు చెందిన లక్ష్మణ్‌‌ ఈ యాప్‌‌ను  డౌన్‌‌లోడ్‌‌ చేసుకుని  బెట్టింగ్‌‌ ఆడి రూ.1.16 లక్షలు కోల్పోయాడు. బాధితుడి ఫిర్యాదుతో సిటీ సైబర్‌‌‌‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా చైనా ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫ్రాడ్స్‌‌తో లింకైన అకౌంట్లను గుర్తించారు. ఏపీలోని కర్నూల్‌‌ జిల్లాకు చెందిన ఆర్టీసీ కానిస్టేబుల్‌‌ రాము, శ్రీనివాస్, నాగప్రసాద్‌‌, సాగర్‌‌ గేమింగ్‌‌ యాప్స్‌‌లో ఇన్వెస్ట్‌‌  చేసి డబ్బు కోల్పోయారని గుర్తించారు. అందులో నాగప్రసాద్‌‌ రూ.20 లక్షలు ఐపీఎల్‌‌ విన్‌‌ యాప్‌‌తో మోసపోయాడు. మోసపోయిన ఆ నలుగురిని ఫిలిఫిన్స్‌‌లో షెల్టర్‌‌‌‌ తీసుకున్న అలెన్స్ సంప్రదించాడు. యాప్‌‌లో కోల్పోయిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇస్తామని వారిని నమ్మించాడు. ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్, సిమ్‌‌ కార్డులు అందించాలని కోరాడు. ఒక్కో అకౌంట్‌‌లో డిపాజిట్‌‌ అయ్యే డబ్బుకు 10  శాతం కమీషన్  ఇస్తామని, నెలకు రూ.60 వేలు డిపాజిట్‌‌ చేస్తామని చెప్పాడు. ఇలా వారి నుంచి బ్యాంక్ అకౌంట్స్‌‌ తీసుకున్నాడు. గేమింగ్ యాప్స్‌‌ ద్వారా వచ్చే డబ్బును ఆరు అకౌంట్లలో డిపాజిట్‌‌ చేశాడు. ఇందులో రాము అకౌంట్‌‌ నుంచి రూ.1.2 కోట్లు, నాగప్రసాద్  ఖాతాల నుంచి రూ.1.3 కోట్లు ట్రాన్స్‌‌ఫర్ చేశాడు. ఈ డబ్బును ఢిల్లీలోని రంజన్‌‌ మనీ కార్ప్‌‌, కేడీఎస్ ఫారెక్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ ఫారిన్ ఎక్స్చేంజ్‌‌లకు ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేసి డాలర్లుగా మార్చి చైనాకు తరలించారు.

కంబోడియాకు బ్యాంక్‌‌ అకౌంట్ల సప్లయ్‌‌...

కంబోడియాకు అకౌంట్స్‌‌, సిమ్ కార్డులు సప్లయ్‌‌ చేసిన ముంబైకి చెందిన ఇమ్రాన్‌‌ దుబాయ్‌‌లో నివాసం ఉండేవాడు. హైదరాబాద్‌‌కు ఫర్వేజ్‌‌, సయ్యద్ సుల్తాన్‌‌, మీర్జా నదీమ్‌‌ బేగ్‌‌లతో కలిసి అతను ఖాతాలు తెరిపించాడు. మోసంచేసి కొట్టేసిన డబ్బును రాము, శ్రీనివాస్, నాగప్రసాద్, సాగర్ అకౌంట్ల ద్వారా డైవర్ట్ చేశాడు. రెండు రోజుల క్రితం దుబాయ్‌‌ నుంచి ముంబై వచ్చిన ఇమ్రాన్‌‌ను స్థానిక ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇమ్రాన్‌‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. 
.........................................................