అమెరికా మీదికి చైనా మరో స్పై బెలూన్​

అమెరికా మీదికి చైనా మరో స్పై బెలూన్​
  • లాటిన్ అమెరికాపై ఎగురుతున్నట్లు గుర్తింపు 
  • యూఎస్​పై ఉన్న బెలూన్ తూర్పు దిశగా కదలిక   
  • కంటిన్యూగా ట్రాక్ చేస్తున్నామన్న అధికారులు

వాషింగ్టన్:   అమెరికా ఎయిర్​ స్పేస్​పై 3 బస్సులంత సైజులో ఉన్న చైనాకు చెందిన ఓ స్పై బెలూన్ ఎగురుతున్న వివాదం కొనసాగుతుండగానే.. డ్రాగన్ కంట్రీకి చెందిన మరో స్పై బెలూన్ లాటిన్ అమెరికా గగనతలంలో ఎగురుతున్నట్లు వెల్లడైంది. ‘‘లాటిన్ అమెరికా (దక్షిణ అమెరికాతో సహా నార్త్ అమెరికాలో కొంత భాగం)పై ఆకాశంలో మరో చైనీస్ స్పై బెలూన్ ఉన్నట్లు గుర్తించాం. అయితే, అది కచ్చితంగా ఏ దేశంపై ఎగురుతుందన్నది ఇంకా కన్ఫమ్ కాలేదు” అని శుక్రవారం అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికాలోని మోంటానా స్టేట్ లో కీలకమైన ఎయిర్ ఫోర్స్ బేస్ పై ఆకాశంలో గురువారం ఎగురుతూ కనిపించిన చైనీస్ స్పై బెలూన్ ప్రస్తుతం తూర్పు దిశగా కదులుతోందని తెలిపింది. అది కచ్చితంగా చైనా పంపిన స్పై బెలూనే అని, ఆ బెలూన్ కింది భాగంలో నిఘా కోసం ఉపయోగించే భారీ పేలోడ్ ను గుర్తించామని స్పష్టం చేసింది. ఆ స్పై బెలూన్ ను మిసైల్స్ తో పేల్చివేస్తే జనావాసాలపై శకలాలు పడే ప్రమాదం ఉన్నందున దానిని నిరంతరం ట్రాక్ చేస్తున్నామని రక్షణ శాఖ పేర్కొంది. 

బ్లింకెన్ చైనా టూర్ రద్దు

చైనీస్ స్పై బెలూన్ వివాదం కారణంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా టూర్ ను రద్దు చేసుకున్నారు. శుక్రవారం రాత్రే ఆయన చైనా పర్యటనకు బయలుదేరాల్సి ఉండగా, ఈ ట్రిప్ ను వాయిదా వేసుకున్నట్లు బ్లింకెన్ శనివారం ప్రకటించారు. అమెరికా గగనతలంలోకి చైనీస్ స్పై బెలూన్ రావడం కచ్చితంగా తమ దేశ సార్వభౌమత్వాన్ని, ఇంటర్​ నేషనల్ చట్టాలను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ బెలూన్​ను తమ దేశంపై నుంచి అవతలికి పంపించడమే తమ ప్రయారిటీ అని ఆయన స్పష్టం చేశారు. 
ఆ బెలూన్ తమదేనని ఒప్పుకున్న చైనా అమెరికాపై ఎగురుతున్న బెలూన్ గురించి తమకేమీ తెలియదని గురువారం ప్రకటించిన చైనా.. శుక్రవారం మాట మార్చింది. అది తమ బెలూనే అని ఒప్పకుంది. అయితే దానిని వెదర్ రీసెర్చ్ కోసమే పంపినమని, , ఎవరిమీదా నిఘా కోసం కాదని వెల్లడించింది. గాలుల దిశ మారడం వల్లే అది పొరపాటున అమెరికా ఎయిర్​ స్పేస్​లోకి  ప్రవేశించిందని పేర్కొంది.

ఇంకొన్ని రోజులు అమెరికాపైనే..  

అమెరికా మీదికి చైనా స్పై బెలూన్​లను గతంలోనూ పంపింది. అయితే, ప్రస్తుతం ఎగురుతున్న స్పై బెలూన్ మాత్రమే కొన్ని రోజుల పాటు అమెరికాపైనే ఆకాశంలో ఎగురనుంది. ఏదైనా ఒక ప్రాంతంపై కొన్నిరోజుల పాటు నిలకడగా ఉండటం, ఒకే ప్రాంతంపై అటూఇటూగా తిరగడం వంటివి కూడా దీనికి సాధ్యమేనని చెప్తున్నారు. స్పై బెలూన్ లు భారీ సైజులో ఉన్నా.. ఆకాశంలో 20 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంటాయని, వీటిని రాడార్లు గుర్తించడం కూడా కష్టమేనని పేర్కొంటున్నారు.'