
హాలియా, వెలుగు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శనివారం కుటుంబ సమేతంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా గవర్నర్ స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్లే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్ గవర్నర్ దంపతులకు పుష్పగుచ్చమిచ్చి ఘన స్వాగతం పలికారు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నేరుగా స్థానిక లాంచి స్టేషన్ కు బయలుదేరి నాగార్జున కొండను సందర్శించారు. అక్కడ పురావస్తు శాఖ మ్యూజియాన్ని సందర్శించి అక్కడి బుద్ధుని విశేషాలు తెలుసుకున్నారు. సాయంత్రం తెలంగాణ పర్యాటక శాఖ విజయ విహార్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఆదివారం ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బుద్ధవనాన్ని సందర్శించి మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ బయలుదేరనున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.