
నల్గొండ, వెలుగు: నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని వైన్స్ షాపులకు చివరి రోజు భారీగా దరఖాస్తులు నమోదయ్యాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని వైన్స్ షాపులకు 7,119 దరఖాస్తులు వచ్చాయి. శనివారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు 247 షాపులకు వచ్చిన అప్లికేషన్స్ వివరాలను అధికారులు ప్రకటించారు. వ్యాపారులు ఇంకా క్యూలో ఉన్నందున మరికొన్ని అప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంది. 2023తో పోలిస్తే ఈసారి ఆప్లికేషన్స్ చాలా తగ్గా యి.
కానీ అప్లికేషన్స్ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాత్రం కాస్తంత పెరిగింది. 2023లో అప్లికేషన్ రుసుం రూ.2లక్షలు కాగా, అప్పుడు 15,349 వచ్చాయి. దాంతో ప్రభుత్వానికి రూ.306 కోట్ల ఆదాయం వచ్చింది. 2025లో ప్రస్తుతం 247 షాపులకు 7,119 అప్లికేషన్స్ వచ్చాయి. దీంతో సర్కార్‌కు రూ.219.57 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకొన్ని అప్లికేషన్స్ ప్రాసెస్‌లో ఉన్నందున గతేడాది కంటే కాస్తంత ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
దీంట్లో నల్గొండ జిల్లాలో 154 షాపులకు 4,632 అప్లికేషన్లు వచ్చాయి. కాగా సూర్యాపేటలో 93 షాపులకు 2617 అప్లికేషన్లకు 78.51కోట్ల ఆదాయం వచ్చింది. సూర్యాపేటతో పోలిస్తే నల్గొండ జిల్లాలోనే అప్లికేషన్స్ ఎక్కువ రావడం గమనార్హం. ఒక్కో షాపుకు సగటున 2023లో 40 ఆప్లికేషన్స్ వస్తే, ఇప్పుడు 30 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
గతంతో పోలిస్తే తగ్గిన అప్లికేషన్స్
2023తో పోలిస్తే ఈసారి 5,632 అప్లికేషన్స్ తగ్గాయి. ఆదాయంలో పెద్దగా మార్పులేదు. అప్లికేషన్స్ ఫీజు రూ.3లక్షలకు పెంచడం వల్ల ఆశించిన స్థాయిలో వ్యాపారులు ఆసక్తి చూపలేదు. కానీ కొత్త పాలసీలో తెచ్చిన కొన్ని కీలకమైన మార్పులతో మద్యం సిండికేట్ పటాపంచాలు అయిందని తెలుస్తోంది. వైన్స్ షాపులు పెట్టుకునే అడ్డాలను పెంచారు. మేజర్ మండలాల్లో షాపుల అడ్డాలను గ్రామాలకు విస్తరించారు.
నల్గొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో క్లస్టర్ పాలసీ ఎత్తేశారు. దీంతో షాపులు ఎక్కడైనా పెట్టుకునే వెసులుబాటు కల్పించారు. సిండికేట్లు దెబ్బతినడంతో గ్రామాల్లో బెల్టుషాపులు దందా తగ్గుతుందని, తద్వారా ఎమ్మార్పీ రేట్లకు గ్రామాలకు మద్యం అందుబాటులో వచ్చేలా పాలసీ మార్పు చేశారు.