రైస్ మిల్లుల్లో వడ్లను అన్ లోడింగ్ వెంటనే చేయాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

రైస్ మిల్లుల్లో వడ్లను అన్ లోడింగ్ వెంటనే చేయాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

కోటగిరి, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో పంపించిన వడ్లు రైస్ మిల్లుల్లో వెనువెంటనే అన్ లోడింగ్ జరిగేలా చూడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోతంగల్ మండల కేంద్రంతోపాటు కోటగిరి మండలంలోని కొత్తపల్లిలో ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను శనివారం అడిషనల్​కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. రైతులను పలకరించి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. 

ధాన్యం లోడింగ్, రవాణా కోసం ఎవరికీ డబ్బులు చెల్లించొద్దని చెప్పారు. తరుగు పేరిట తూకంలో కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, సహకార శాఖ రుద్రూర్ క్లస్టర్ అధికారి అంబర్ సింగ్ రాథోడ్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవోలు శ్రీనివాస్ రెడ్డి, చందర్, ఏవోలు రాజు, నిశిత, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.  

రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు

వర్ని: రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్మి మోసపోవద్దని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. రుద్రూర్​ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్​ సందర్శించారు. అనంతరం మాట్లాడుతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లకు ధాన్యాన్ని తరలించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. తొందరపడి తక్కువ ధరకు దళారులకు విక్రయించవద్దన్నారు. కొనుగోలు సెంటర్లలో రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే  రశీదులు ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్​కలెక్టర్​కిరణ్​కుమార్, తహసీల్దార్​ బర్మావత్​ తారాభాయి, ఐకేపీ ఏపీఎం బస్వంత్, ఏవో సాయికృష్ణ ఉన్నారు.

ఆయిల్​పామ్​సాగు విస్తీర్ణం ఎందుకు పెరగట్లే..?

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఆయిల్​పామ్​సాగు విస్తీర్ణం పెంచడంలో ఎందుకు సక్సెస్​ కావడంలేదని నిజామాబాద్​ కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆయిల్​పామ్​నర్సరీ నిర్వాహకులైన ప్రీ యునిక్​కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ ​నిర్వహించి మాట్లాడారు. రైతులకు లాభదాయకమైన పంట సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం, సబ్సిడీ మొక్కలు అందిస్తున్నా 3,500 ఎకరాల టార్గెట్ ఎందుకు చేరుకోవడంలేదన్నారు. 

ప్రచారం లోపం ఉంటే సరిచేసుకొని రిజల్ట్​చూపాలని లేని పక్షంలో యాక్షన్​ తీసుకుంటామన్నారు. ప్లాన్​ప్రకారం ముందుకు వెళ్లాలని, మొదట ఆదర్శ రైతులను ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఏవో గోవిందు, హార్టికల్చర్​ ఆఫీసర్​ శ్రీనివాస్​ తదితరులున్నారు.