చైనాలో రోజుకు 10లక్షల కరోనా కేసులు..5వేల మరణాలు

చైనాలో రోజుకు 10లక్షల కరోనా కేసులు..5వేల మరణాలు

కరోనా విజృంభణతో చైనా విలవిలలాడుతోంది. కరోనా మొదలైన తర్వాత ప్రపంచం ఇంత వరకూ చూడని విలయాన్ని చైనా ఎదుర్కోనుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రతీ రోజూ 10 లక్షల కేసులు, 5000 మరణాలు నమోదు అవుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. తాజా సర్వే ప్రకారం ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా రోజుకు 10 లక్షల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి.

చైనాలో 3 నెలల్లో 3 కరోనా వేవ్స్ విజృంభిస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్లు హెచ్చరిస్తున్నారు.  జనవరిలో ఫస్ట్ వేవ్ వస్తుందని, ఆ వెంటనే జనవరి లాస్ట్ వీక్ నుంచి సెకండ్ వేవ్ కొనసాగుతుందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కు చెందిన చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్యోయూ వెల్లడించారు. ఇక ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చిలో థర్డ్ వేవ్ వస్తుందన్నారు. జనవరిలో రోజువారీ కేసులు 3.7 మిలియన్లకు పెరగొచ్చని బ్రిటన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ ఎనలిటిక్స్ తెలిపింది. మార్చిలో రోజువారీ గరిష్ట స్థాయి 4.2 మిలియన్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 

ఇదిలా ఉంటే జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో మాస్ టెస్టింగ్ కేంద్రాలను ప్రభుత్వం మూసేసింది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. దీంతో చివరకు అంత్యక్రియలు చేసేవారు కూడా దొరకడం లేదు. ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. మరోవైపు ఫార్మాసీల్లో మందులు అడుగంటుకుపోయాయి.  అయితే చైనా మాత్రం గత 24 గంటల్లో కొత్తగా 3 వేల కొత్త కేసులు నమోదు అయ్యాయని.. ఎవరూ చనిపోలేదని చెబుతోంది. 

డెత్స్ 15 లక్షలకు పెరుగుతయ్ 

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. చైనాలో లక్షల మంది కరోనాతో చనిపోయే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎస్ఈఐఆర్ మోడలింగ్ ప్రకారం దేశంలో కరోనా వల్ల 15 లక్షల మంది చనిపోవచ్చని ‘ది ఎకనమిస్ట్’ వెల్లడించింది. చైనా రీఓపెన్ తర్వాత పరిస్థితిని బట్టి.. 13 లక్షల నుంచి 21 లక్షల మధ్య మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ‘ది లాన్సెట్’ వెల్లడించింది.