చైనీస్ కు జొన్నలు వద్దంట

చైనీస్ కు జొన్నలు వద్దంట

ప్రపంచంలో గోధుమలకు భారీ గిరాకీ ఉన్న దేశాల్లో చైనాది ఫస్ట్​ ప్లేస్​. చైనీయులు జొన్నల నుంచి గోధుమలకు తమ ఫుడ్​ హేబిట్​ మార్చుకోవడమే కారణం. గోధుమలతో బన్నులు, నూడుల్స్​, రొట్టెలు చేసుకుని కడుపు నిండా తింటున్నారు. ముఖ్యంగా ఉత్తర​ చైనాలో ఈ ఐటమ్స్​ని బాగా ఆదరిస్తున్నారు. ఏ ఇంట్లోనైనా గోధుమ వంటల ఘుమఘుమలే అంటున్నారు ఫుడ్​ ఎక్స్​పర్ట్​లు.  ప్రస్తుతం తూర్పు ఆసియాలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న జొన్నల్ని గతంలో నార్త్​ చైనా వాళ్లు విపరీతంగా పండించేవారు. ఈ విత్తనాల్ని పక్షులకు తిండి గింజలుగా అమెరికన్లు బాగా దిగుమతి చేసుకునేవారు. అయితే ఇప్పుడు జొన్నల ప్లేసును గోధుమలు ఆక్రమించేశాయి. ఉత్తర చైనాలో ఇప్పుడు ఇదే మేజర్​ పంట. ఎందుకిలా జరిగిందనేదానికి అరకొర వివరాలే తప్ప స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదంటున్నారు.

జొన్నలతో పోల్చితే గోధుమ మొక్కలు ఫాస్ట్​గా ఎదుగుతాయి. గోధుమ దిగుబడి కూడా ఎక్కువే. పాత కాలం రైతులు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. జొన్నలనే బాగా సాగు చేసేవారు. గోధుమలతో లాభాలేంటనేది కూడా జనానికి గతంలో కన్నా ఇప్పుడే క్లియర్​గా తెలుస్తోంది. గోధుమ పిండితో గంజి లేదా జావ కాసుకొని తాగొచ్చు. రొట్టెలు, చపాతీలు చేసుకొని తినొచ్చు. జొన్నలతోనూ ఇవి సాధ్యమే. అయినా గోధుమ పంట త్వరగా చేతికి వస్తుండటంతో రైతులు, వినియోగదారులు దీనిపై మొగ్గు చూపుతున్నారు.

వ్యవసాయ పద్ధతుల్లో మార్పు తేవాలని, ఒక్క పంటనే ఎక్కువగా పండించటం సరికాదని సైంటిస్టులు పదే పదే మొత్తుకునేవారు. ఇప్పుడిప్పుడే చైనా రైతులు గోధుమకి మళ్లుతున్నారు. అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రస్తుతం 200 వరకు పంటల్ని రైతులు పండిస్తున్నారు. వీటిలో ఎక్కువగా నూనె గింజలే సాగవుతున్నాయి. చాలాచోట్ల గోధుమ, వరి, మొక్కజొన్నలే ప్రధాన ఆహార పంటలుగా చెలామణీ అవుతున్నాయి. వందేళ్ల కిందట పండించిన పంటల్లో చాలామటుకు ఇప్పుడు లేవు. దాదాపు 75 శాతం వరకు పంటలు కనుమరుగయ్యాయని సమితికి చెందిన ఫుడ్ అండ్​ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్​ అంటోంది.

ఏదీ పర్ఫెక్ట్​ కాదు!

ఫలానా పంట మాత్రమే సరైందని చెప్పటానికి వీల్లేదు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు, ప్రజల అభి‘రుచులకు’ తగ్గట్లుగా పండించటమే బెటర్​ అని ఎక్స్​పర్ట్​లు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని చైనా రైతులు  అర్థం చేసుకొని ఆ మార్గంలో నడుస్తున్నట్లు డేటాని బట్టి తెలుస్తోంది. ఆ దేశంలో గోధుమలకు  డిమాండ్​ పెరుగుతున్నాగానీ.. వరి, సోయాబీన్​, ఓట్స్​, బార్లీ పంటలు మానడం లేదు.

లక్షల మందిని చంపిన ఆలు

గోధుమలతో పోల్చితే జొన్నలకు నీళ్ల వినియోగం తక్కువ. అప్పట్లో వానలు సరిగ్గా పడేవి కావు. జొన్న పంటకి నీళ్లు పెద్దగా అవసరం లేనందున రైతులు ఇష్టపడేవారు. అది పండకపోతే ఆల్టర్నేటివ్​గా గోధుమ పండించేవారు. అంతే తప్ప ఫస్ట్​ ఆప్షన్​ మాత్రం గోధుమకు ఇచ్చేవారు కాదు. అలా ఒకే పంట మీద ఆధారపడి బతకటం ప్రమాదకరమనే విషయం ‘గ్రేట్​ పొటాటో ఫెమైన్​’ తర్వాత తెలిసొచ్చింది. ఐర్లాండ్​లో 1845–49 మధ్యకాలంలో జనాలు ఆలుగడ్డలు బాగా పండించారు. మరో పంట జోలికి వెళ్లలేదు. అయితే, ఆలు పంటకు పురుగు సోకిన సంగతి తెలియలేదు. దాదాపు 10 లక్షల మంది ఆ ఆలుగడ్డల్ని తిని చనిపోయారు.