తెలంగాణలో ప్రతిపక్షం పారిపోతున్నదా..?

తెలంగాణలో ప్రతిపక్షం పారిపోతున్నదా..?

రాష్ట్రంలో  విచిత్రమైన పరిణామాలు చూస్తున్నాం.  దేశంలోనైనా,  ఏ రాష్ట్రంలోనైనా  ప్రతిపక్షపాత్ర  పోషిస్తున్న పార్టీలకు  ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది.  సాధారణంగా ప్రతిపక్షాలు చట్టసభల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తుంటాయి.  కేంద్రంలో  మణిపూర్ అల్లర్లు మొదలు ఎన్నో సమస్యలపై  ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీని డిమాండ్  చేస్తున్నారు. కానీ, సమావేశాల  నిర్వహణ  సంగతి  పక్కనపెడితే  కనీస  ప్రజాసమస్యలను గాలికొదిలేసిన తీరుతో  అక్కడి పరిస్థితి వేరుగా ఉంది. దీనికి భిన్నంగా మనరాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిని సభకు రావాలని పదే పదే ప్రభుత్వమే డిమాండ్ చేస్తోంది.  అయినా,  ఆయన సభకు రావట్లేదు.

తా జాగా  రాష్ట్రంలో నదీజలాల వివాదాలపై, ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఇటు సభలో, అటు ఏపీలో పదే పదే బేసిన్లు లేవు.. బేషజాలు లేవు అంటూ  గోదావరి జలాల్ని రాయలసీమకు తరలించాలని ఆయన చెప్పడం, అదే రీతిలో నాటి ప్రభుత్వం ఉదాసీన వ్యవహారంగా ఉండటం వెరసి ఈ తప్పిదాల ఊతంగానే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టింది ఏపీ ప్రభుత్వం. అయితే,  నేడు ఈ అంశాలతో  కేటీఆర్,  హరీష్ రావు తెలంగాణ  ప్రయోజనాల కన్నా,  ప్రభుత్వంపై  బురదజల్లాలనే  ప్రయత్నాలు చేస్తున్నారు.  సెంటిమెంట్ రగిలించడానికి అబద్ధాలను  ఆలవోకగా ఆడుతూ  రాష్ట్ర ప్రయోజనాలను  గాలికొదిలేశారు. 

స్వార్థప్రయోజనాల కోసం ఆరాటం

ఇంటా బయటా సంక్షోభాలతో  అడుగంటిన తమ పార్టీకి  ప్రాభవాన్ని తీసుకురావాలనే  స్వార్థ ప్రయోజనాలను ఆశిస్తున్నట్టున్నారు. అందులో  భాగంగానే అత్యున్నత చట్టసభల్ని కాదని చౌరస్తాలో చర్చలకు రమ్మని ముఖ్యమంత్రిని పిలుస్తుంటే చట్టసభలపై వారికి గౌరవం లేదనేది ఈ వైఖరితో  స్పష్టం అవుతోంది. అయితే,  రాష్ట్ర  ముఖ్యమంత్రి మాత్రం అక్కడో, ఇక్కడో కాదు  ప్రజల కోసం నిర్ణయాలు జరిగి,  చట్టాలు చేసే  అసెంబ్లీలోనే చర్చిద్దామని  పదేపదే ప్రతిపక్షాన్ని ఆహ్వానించినా...  ప్రత్యేక  అసెంబ్లీ  నిర్వహించాలని మీరు కోరితే  సిద్ధంగా ఉన్నామని  ప్రతిపక్ష నేత సభకు వచ్చి చర్చించి సలహాలు,  సూచనలు  అందజేస్తే  స్వీకరించడానికి  సిద్ధంగా  ఉన్నామని  అంటున్నా  ప్రతిపక్షం  స్పందించడం లేదు.  

 ప్రతిపక్షం  నోటి  నుంచి  అసెంబ్లీ  సమావేశాల ఊసే రాకపోవడం శోచనీయం.  ప్రతిపక్షం  పారిపోవడం  బహుశా దేశంలోనే  మొదటిసారికావచ్చు.  ఎందుకంటే  ప్రాజెక్టుల  నిర్మాణ విషయంలో కాని,  రీడిజైన్  పేరుతో  కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల తీరుపై కానీ,  నదీజలాలు  ప్రాజెక్టులవారీగా పంపకాలు సాధించకపోవడం వంటి  నాటి  ప్రభుత్వ  నిర్ణయాలను  అసెంబ్లీలో  నిలదీస్తారన్న భయం  బీఆర్ఎస్​లో స్పష్టంగా కనబడుతోంది.  అందుకే వారు అసెంబ్లీ కన్నా వీధిచర్చలకే  సిద్ధమంటున్నారు.  అంటే,  వీరి ఆలోచనల్లో  వైచిత్రి ఏంటో  తెలంగాణపై  వీరికున్న బాధ్యత ఏ మేరకో... తేటతెల్లమౌతోంది.

ప్రతిపక్షం ప్రజావిరుద్ధం

వాస్తవానికి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాల్లో మొదటి ముఖ్యమంత్రిగా మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లోనే కృష్ణా నదీజలాల్లో 299 టీఎంసీలుగానే స్వయంగా మన వాటాను నిర్ధారించి పదేళ్లు కాలం గడిపారు. తాత్కాలికమని  వారు చెప్తున్నారు. అయితే, తాత్కాలికమంటే ఒక సంవత్సరం ఉంటుంది.  కానీ, అదే  కేటాయింపులతో  పదేళ్లు  గడపడమంటే నాటి గత పాలకుల నిర్లక్ష్యం ఎంతో అర్థమౌతుంది. ఈ పదేళ్లలో వాటాలు పంచాలని కేంద్రాన్ని నిలదీయాల్సి ఉండె,  కానీ ఆ పని చేయలేదు.  

కేవలం  కాళేశ్వరం అహా... ఓహో... ప్రపంచానికే తలమానికం అంటూ.. ఇంటర్నేషనల్  టూరిజం స్పాట్ లాగా  ప్రజాధనంతో వందల కోట్ల ప్రచారం చేసుకున్నారు. కానీ, ఇప్పుడు  ఆ ప్రాజెక్ట్ నెర్రెలతో... బ్యారేజీల్లో నీళ్లు ఆపలేక, రిజర్వ్ చేయలేని పరిస్థితి ఉంది.  ఈ అంశాలను తప్పించుకోవడానికి కూడా వారు అసెంబ్లీ సమావేశాలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  పైపెచ్చు ప్రత్యేక సమావేశాలంటే జంకుతున్నారని  అర్థమవుతోంది.  అసెంబ్లీ  ప్రత్యేక సమావేశాలను  ప్రభుత్వం పెడుతుందంటే ప్రతిపక్షాలు ఎగిరి గంతేస్తాయి.  కానీ, ఇక్కడ ప్రతిపక్షం ప్రజావిరుద్ధంగా వ్యవహరిస్తోంది. 

ప్రతిపక్షం విలువ తెలిసిన సీఎం రేవంత్​

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి  ప్రజాస్వామ్యంలో  ప్రభుత్వ పాత్ర ఎంతో... ప్రతిపక్షం పాత్ర కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నారు.  ఎందుకంటే  ప్రతిపక్షం విలువెంతో  ఆయనకు బాగా తెలుసు.  తన సుధీర్ఘ  ప్రజా జీవితంలో ప్రతిపక్ష పాత్రనూ  పోషించారు. ఆ  స్ఫూర్తే  నేడు అధికారంలో ఉండి,  స్యయంగా  ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా  ప్రతిపక్షానికి  ప్రాధాన్యత ఇవ్వడం ఎప్పుడూ చేస్తున్నారు.  అయినా,  బీఆర్ఎస్  ఇప్పటివరకూ  సీఎం ఆహ్వానాన్ని స్వీకరించకపోవడం  శోచనీయం.  కేంద్ర ప్రభుత్వం   నుంచి  మనం  రాబట్టుకోవాల్సిన  అంశాలపై,   ప్రజల హక్కుల కోసం,  నీటి హక్కుల కోసం  రాష్ట్రంలో  ప్రభుత్వం,  ప్రతిపక్షం  కలిసి  చర్చించుకొని  కేంద్రంపై  ఒత్తిడి తేవాల్సిన బాధ్యతలో  భాగంగానే  అసెంబ్లీకి  ప్రధాన ప్రతిపక్ష  నేతను  ఆహ్వానించారు.  అంతేతప్ప  ఆయనకు  ఇక్కడ   ఏదో  వ్యక్తిగత,  రాజకీయ  అజెండాలేమీ  లేవు.  

 కలిసిరాని ప్రతిపక్షం

రాష్ట్ర  ప్రయోజనాల్ని కాపాడేలా నీటివాటాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా  అవసరమైతే  స్టేక్ హోల్డర్లను,  నిపుణులను పిలిచి చర్చిద్దామని,  ఇందుకు  అసెంబ్లీలో  ప్రధాన ప్రతిపక్షం కలిసి రావాలనడంలో ఎలాంటి దురుద్దేశాలు కనబడడం లేదు.  కేసీఆర్  ఆరోగ్య కారణాలతో అసెంబ్లీకి రాలేకపోతే  ఎర్రవెల్లి  ఫాంహౌస్​కు  వస్తాననడం  రాష్ట్ర ప్రభుత్వ  గొప్ప ఆలోచనగా,  సీఎం  చిత్తశుద్ధిగా  చూడాలి.  అంతేకాని  ఏదో  కేసీఆర్  సభలో చర్చకు రాకపోతే.. ప్రజాప్రయోజన సాధనాలు ఏవీ ఆగవు.   కానీ,  వారిని ఇందులో  భాగస్వాములను  చేయాలనే  ఆలోచన  తప్ప  మరేం  కాదనేది  సుస్పష్టం.  తొమ్మిదిన్నరేళ్లుపైగా  రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా,  నేడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీగా  రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలు, చట్టసభల పట్ల గౌరవం ఉంటే.. తెలంగాణ నదీజలాల వాటాలు సాధించుకోవడానికి సభకు రావాలి.  రాకపోతే  ప్రజల్లో నిలబడే అన్ని అర్హతల్నీ  బీఆర్ఎస్  కోల్పోతుంది.

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సీఈవో, టిసాట్ నెట్​వర్క్​