
తెలంగాణలో ఆది నుంచి కల్లు తాగుట అలవాటుగా ఉంది. పెద్ద ఎత్తున తాటి, ఈత చెట్లు ఉండడంతో కావలసినంత స్వచ్ఛమైన కల్లు దొరికేది. వ్యవసాయ విస్తరీకరణతో చాలామటుకు ఈత, తాటి చెట్లను తొలగించడం వల్ల కల్లు లభ్యత తగ్గిపోయింది. మరోవైపు జనాభా పెరుగుదలతో తాగేవారి సంఖ్య పెరగడంతో స్వచ్ఛమైన కల్లు స్థానే కల్తీ కల్లుకు బీజం పడింది. దీనికితోడు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కల్లుకు గిరాకీ ఉండడంతో అనంతపురం వంటి దూరప్రాంతాల నుంచి కల్లు రవాణా చేస్తున్నా.. సరిపోకపోవడంతో పెద్ద ఎత్తున కల్తీ కల్లు దందా మొదలైంది.
ఆబ్కారీ తాడి పాలసీ 2004 ప్రకారం 50 కి.మీ. పరిధిలో తాటి, ఈత చెట్లు ఉన్న ప్రాంతంలోనే కల్లు దుకాణాలకు అనుమతి ఇవ్వాలి. ఈ పాలసీ ప్రకారం హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల 50 కి.మీ. లోపు తాటి, ఈత చెట్లు లేనందున 2004వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలు మూతపడ్డాయి.
పదేండ్లు మూతపడ్డ కల్లు దుకాణాలు
మూతపడ్డ కల్లు అమ్మకందారులు హైకోర్టులో పిటీషన్ (నం. 18181/2024) వేయగా అప్పటి ప్రభుత్వం ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్, డైజోపాం వంటి వాటితో కల్తీ కల్లు తయారుచేస్తున్నారని దానితో ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని తెలిపారు. అలాగే 2002 నుంచి 2004 వరకు సుమారు 98 మంది ప్రజలు ముఖ్యంగా పేదవారు కల్తీ కల్లు తాగి చనిపోయారని కోర్టువారికి తెలపగా కోర్టువారు ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ, హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలు మూసివేయడాన్ని సమర్థించి కల్లు దుకాణదారుల కేసు కొట్టివేశారు. ఈవిధంగా 2004 నుంచి సుమారు 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలు మూతపడ్డాయి.
2014 నుంచి కల్లు దుకాణాలు మళ్లొచ్చాయి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొద్ది నెలలలోనే మరల జీఓ. నం. 24 తేది 4–-9–-2014 నాడు మళ్ళీ కల్లు దుకాణాలు తెరవడానికి అనుమతులు ఇచ్చారు. దీనితో పేదవారు ఉండే బస్తీలలో గల్లీగల్లీకి ఒకటి చొప్పున సుమారు వందవరకు కల్లు దుకాణాలు తెరిచి విరివిగా కల్తీకల్లు అమ్మడం మొదలైంది.
ఒకసారి మూసివేసిన కల్లు దుకాణాలు మళ్ళీ ఎందుకు తెరిచారని కమిషనర్ ఎక్సైజ్ వారిని సమాచారహక్కు చట్టం ద్వారా అడుగగా వారు మేం ఎటువంటి ప్రపోజల్ ప్రభుత్వానికి పంపలేదు. మూతపడ్డ కల్లు దుకాణాలు తెరుచుట ప్రభుత్వ నిర్ణయమని, ఇందులో మా ప్రమేయం లేదని లేఖ 1073/2014/C.P.E./E1 తేది 17-–10–-2014 ద్వారా తెలిపారు. బహుశా అప్పటి ప్రభుత్వం కల్లు దుకాణాలకు లైసెన్స్ ఇచ్చి కల్తీ కల్లు అమ్మకానికి తెరలేపింది. ఒక హైదరాబాద్ నగరంలోనేకాక
రాష్ట్రమంతా కూడా కల్తీ కల్లు అమ్మకం అప్పటినుంచి యథేచ్ఛగా జరుగుతోంది.
గుడ్‌గవర్నెన్స్ ఫోరం ఎన్ని దరఖాస్తులు చేసినా..
కల్తీకల్లు అమ్మకం ఆపడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆబ్కారీ కమిషనర్‌కి, ప్రధాన కార్యదర్శికి ఎన్ని దరఖాస్తులు చేసినా ఫలితం లేకపోయింది. కనీసం కల్లు దుకాణాలలో అమ్మే కల్లుకు అప్పుడప్పుడు పరీక్షలు నిర్వహించాలని కోరినా ఆబ్కారీ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం కల్తీ కల్లు తాగి ఎవరైనా మరణించినా అప్పటికప్పుడు హడావుడి చేయడం, కల్లు దుకాణదారునిపై కేసులు బనాయించినట్లు చూపించడం అటు తరువాత ఎటువంటి చర్యలు ఉండవు. ఆబ్కారీశాఖ వారు కల్తీ కల్లు నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్
డిఅడిక్షన్ సెంటర్‌లో ప్రతిరోజు 50 మంది వరకు బాధితులు వస్తున్నా.. అది ఆబ్కారీశాఖ వారికి కనిపించడంలేదు. ఒకసారి కల్తీ కల్లుకు అలవాటు పడితే మానడం చాలా కష్టం. కల్తీ కల్లు లేని పక్షంలో అతడు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తాడని ఒక ఆబ్కారీ అధికారి చెప్పడం విడ్డూరంగా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో తాటి చెట్టు రాష్ట్ర వృక్షం. అక్కడ తాటికల్లు అమ్మడంపై నిషేధం ఉంది.
అయితే, గీత కార్మికులు తాటి చెట్టు నుంచి వచ్చిన కల్లును బెల్లంగా తయారుచేసి జీవనోపాధి పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీకల్లు అమ్మకం ఆపడానికి ప్రభుత్వపరంగా ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర హైకోర్టులో కల్లు దుకాణాలు మూసివేయాలని పిల్ (7/2024) వేయడం జరిగింది. దీనిపై కోర్టువారు స్పందిస్తూ ఫిబ్రవరి 2024లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, ఎక్సైజ్ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. కేసు కోర్టులో పెండింగులో ఉంది.
పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం చిన్నచూపు!
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల వాడకం ఒక సమస్యగా తయారైంది. డ్రగ్స్ ఎక్కువగా ధనవంతులు, వారి పిల్లలు, సెలబ్రిటీస్ వాడుతున్నారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ అరికట్టడానికి ఒక ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ నెలకొల్పి పబ్బులు, పార్టీలలో డ్రగ్స్ వాడకాన్ని అరికడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో సుమారు 20 లక్షల పేదవారు 1500 మురికివాడలలో నివసిస్తున్నారు. ఈ పేదవారు కల్తీ కల్లు తాగుతూ తీవ్ర అనారోగ్యం పాలవుతున్నా ఆబ్కారీ శాఖ గాని, ప్రభుత్వానికిగాని ఏమాత్రం పట్టింపులేదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 47 ప్రకారం మత్తు పానీయాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మత్తు పానీయాల సేవనకు ఊతమిచ్చింది. 2004 సంవత్సరంలో మూసివేసిన కల్లు దుకాణాలను మళ్ళీ 2014లో తెరిపించడం పెద్ద తప్పు. దాంతో కల్తీ కల్లుకు అవినీతి కూడా ఒక బలమైన కారణంగా మారింది.
బాధితుల్లో సగం మహిళలే
కల్తీ కల్లు సేవించేవారిలో సగం వరకు పేద మహిళలే ఉన్నారు. ఈ ప్రభుత్వం మహిళాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కల్లు దుకాణాలు మూసివేస్తే మహిళలకు ఎంతో లాభం కలుగుతుంది. బాధ్యతారహితంగా ప్రవర్తించి కల్తీ కల్లు తాగి చనిపోవడానికి కారణమైన కల్లు దుకాణదారులతోపాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు కల్లు దుకాణదారులతో నష్ట పరిహారం ఇప్పించాలి. అలాగే 2004 ఆబ్కారీ పాలసీ ప్రకారం 50 కి.మీ. లోపు గీతకు పనికి వచ్చే ఈత, తాటిచెట్లు లేని ప్రాంతాలలో కల్లు దుకాణాలు మూసివేయడానికి చర్యలు చేపట్టాలి.
- యం. పద్మనాభరెడ్డి,
అధ్యక్షుడు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్