మన ఫారిన్ పాలసీ సంక్షోభ నివారణ ఎలా?

మన ఫారిన్ పాలసీ సంక్షోభ నివారణ ఎలా?

పహల్గాం ఉగ్రదాడి తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిక్షలాగ  పెంచిన సుంకాల వలన,  అట్లాంటిక్ రెండుతీరాల మధ్య భావోద్వేగాలు పెరిగిపోయాయి. కీలక విదేశాంగ నిర్ణయాలు జరిగే ఢిల్లీలోని సౌత్ బ్లాక్ హడావుడిగా ఉంది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, వారి ట్రేడ్ సలహాదారులు, రాయబారుల వ్యాఖ్యలు ఆజ్యం పోసేవిలా ఉన్నాయి తప్ప, దౌత్యపరంగా లేవు.  నన్ను బాగా కలచివేసింది ఏంటంటే.. నిన్నటివరకూ వ్యూహాత్మక భాగస్వాముల మాదిరి ఉన్న దేశాలు, ప్రతీకారంగా మాట్లాడుకోవడం అటుంచి, కనీసం తాము రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలన్న ఆలోచన, స్వీయ నియంత్రణ లేకుండా మాట్లాడడం. 

ఒక వ్యూహకర్తగా,  సగర్వ భారతీయుడిగా దౌత్యం అనేది 'నువ్వెంత అంటే నువ్వెంత' అనే ప్రతీకార ప్రక్రియ కాదని చెప్పగలను.  ఇది ఒక్కసారిగా ముగిసిపోయేది కాదు. దౌత్యం అనేది సుదీర్ఘమైనది. శ్రద్ధతో, ఓపికతో కూడి, పరిణితి చెంది ఉండాలి.  అప్పుడే  పరస్పర విశ్వాసంతో కూడిన బంధం ఏర్పడుతుంది.  ఎంతోకాలంగా నిర్మించుకుంటూ వచ్చిన బంధాన్ని ఒక దేశంవారు, తాత్కాలిక వాణిజ్య ప్రయోజనం కోసం దెబ్బతీస్తుంటే, రెండోదేశం కూడా అంతే ఆవేశంగా స్పందించడం అరుదు. భారత్ వంటి పరిణిత  ప్రజాస్వామ్య దేశాలు ఇలాంటి సమయంలో  కోపానికి లొంగకుండా, సంయమనం పాటించాలి. ఈ సమయంలో మహాత్మా గాంధీ చెప్పిన ఎన్నటికీ కాలం చెల్లని మాట ఒకటి  గుర్తు చేసుకోవాలి. ‘కంటికి కన్ను తీసుకుంటూపోతే,  ప్రపంచం గుడ్డిది అయిపోతుంది’.  ఇది యుద్ధం విషయంలో ఎంత నిజమో, దౌత్యం విషయంలో కూడా అంతే నిజం.  స్వీయ నియంత్రణ, హుందాతనం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్​లే  మన స్పందనలు.  మరీ ముఖ్యంగా ఎదుటివారు రెచ్చగొడుతున్నప్పుడు, మన స్పందనలను తీర్చిదిద్దుకోవలసిందే.

ప్రతిస్పందన దౌత్యం

ఈ మధ్యకాలంలో  వాషింగ్టన్  ప్రవర్తన కానీ, కొంతమంది మన దేశ ప్రతినిధుల ప్రవర్తన కానీ, ఈ రెండూ కూడా అత్యున్నత విలువలున్న రాజనీతి అనిపించుకోదు. అసంబద్ధ  ప్రకటనలు, అవతలి దేశాధినేతపై  వ్యక్తిగత విమర్శలకు  అంతర్జాతీయ దౌత్యంలో స్థానం లేదు.  

అమెరికా దేశీయ విధానమార్పుల విషయంలో భారతీయ విదేశాంగ ప్రతినిధులు కూడా మాటకుమాట తరహా స్పందనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రవర్తన భారత్ వంటి నాగరికశక్తి స్థాయిని తగ్గిస్తుంది.  దౌత్యం యుద్ధవ్యూహంలా ఉండకూడదు. యుద్ధంలో వేగంగా,  ధైర్యంతో,  ఎదుటిపక్షాన్ని గట్టి దెబ్బ తీసేందుకు గురిచూసి కొడతారు. కానీ, దౌత్యం అందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. సహనం,  ముందుచూపు, ఎంచిచూసి చేసే  సంభాషణలతో ఇది జరుగుతుంది.  ఇది  ప్రతీకారంతో  వేడి పెంచేది కాదు, విధానాలను తీర్చిదిద్దేది. ఇది బంధాన్ని నిలిపేదే తప్ప కూల్చేది కాదు.  ప్రస్తుతం ఉన్న సంక్షోభం ఆత్మపరిశీలన కోరుతుంది. సంఘర్షణాత్మక వ్యాఖ్యలు తాత్కాలికంగా  దేశవాసుల్లో గర్వాన్ని తొణికేలా చేస్తాయి.  కానీ, దీర్ఘకాలంలో పరస్పర విశ్వాసాలను దెబ్బతీస్తాయి. బహిరంగంగా జరిగే ఈ మాటల యుద్ధాన్ని ప్రతి దేశమూ గమనిస్తోంది.

 భారతదేశం చేసింది సరైనదే

ప్రస్తుత పరిస్థితుల్లో  భారత్ పూర్తిగా తన దౌత్య పద్ధతులను వదిలేసింది అనడం కూడా సరికాదు.  సంక్షోభాన్ని,  పరిణితితో  సమన్వయం చేసి సమస్యను పరిష్కరించిన చరిత్ర  భారత్  సొంతం. అది అలీనోద్యమ కాలం కావచ్చు, పాకిస్తాన్​తో  యుద్ధ సమయం కావచ్చు,  1998 అణు పరీక్షల తరువాత  విధించిన ఆంక్షలు కావచ్చు.  ఎన్నడూ భారత్  తన విస్తృత నాగరిక లక్ష్యాలను విస్మరించలేదు.  కొన్నిసార్లు భారత్  స్వీయ నియంత్రణ బలహీనతగా కనిపించింది.  కానీ,  వాస్తవంగా అదే భారత్ కి ఉన్న గొప్ప బలం.  కాలగమనంలో  మనం అనేకసార్లు ఆ సహనాన్నీ, శాంతియుతంగా దౌత్య విధానాలను, నిబద్ధతతో కూడిన చర్చలను కొనసాగించి ఫలితాలను పొందాం.  మనల్ని ఎంత  రెచ్చగొట్టినా ఈ  సంప్రదాయం తప్పక కొనసాగాలి.

భారతదేశపు నాగరిక బాధ్యత

ఇవాళ భారత్ అనేది కేవలం ఒక దేశం మాత్రమే కాదు. ఇది నాగరిక మహాశక్తి.  మన బలం కేవలం జీడీపీ గణాంకాలు లేదా సైనిక శక్తిలోనే లేదు.  మన బలం ఈ దేశపు అపార విజ్ఞాన సంపద, మన భావోద్వేగ బుద్ధి, అవతలి పక్షం రెచ్చిపోయినా,  మనం స్థిరంగా ఉండడంలోనే ఉంది.  కాబట్టి,  ప్రతీకార దౌత్యం మనల్ని తగ్గించేలా కావద్దు.  భారతీయ శైలిలో సంక్షోభ నిర్వహణ అంటే,  కాలపరీక్షకు నిలిచిన మన నాగరికత జ్ఞానంపై ఆధారపడుతూ,  రెచ్చగొడితే  రెచ్చిపోయే  అపరిపక్వతకు దూరంగా ఉండాలి.  చరిత్ర దీర్ఘదృష్టిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ముందుకు కొనసాగాలి.  ఒకవేళ అమెరికా తాత్కాలిక వాణిజ్య ప్రయోజనాలతో ఆటలాడుతుంటే,  మనం కూడా తిరిగి అదే చేసి మన స్థాయి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు.  మనం ఆలోచనతో వ్యవహరించి, ఆవేశం కంటే విద్వత్తే గొప్పదని ఈ ప్రపంచానికి చాటాలి. 

కాలం మారుతుంది

భారత్, -అమెరికా సంబంధాల్లో ఈ ఉద్రిక్తత మొదటిసారి కాదు, చివరిదీ కాదు.  కానీ, మన స్పందన ఆచితూచి, శాంతియుతంగా, గౌరవంతో, మన నాగరిక తాత్వికత మీద ఆధారపడి ఉండాలని ఒక వ్యూహకర్తగా నేను భావిస్తున్నాను.  ప్రపంచం మనల్ని చూస్తోంది.  మనం మాట్లాడే  ప్రతిమాట, మనం కనిపించే తీరు వచ్చే దశాబ్దాల్లో భారత్​ను ఎలా చూస్తారనే దానికి కొలమానంగా మారతాయి.  తాత్కాలిక కోపం మనల్ని నిర్వచించేలా ఉండకూడదు.  దాని బదులు  స్వీయ నియంత్రణ,  హుందాతనం, జ్ఞానాన్ని మనం ఎంచుకోవాలి.  భారత  విదేశాంగ విధాన దిక్సూచి ముల్లును క్షణికావేశంతో కాక, తరాల నాగరిక తాత్వికత, బౌద్ధిక జ్ఞానంతో సరి చేసినప్పుడే అద్భుతంగా  పనిచేస్తుందని నేను చెప్పగలను.  అమెరికావాళ్లను వాళ్లకు  తెలిసిన, చేతనైన రీతిలో ఆడనివ్వండి. మనం మాత్రం మనదైన భారతీయ శైలిలో ఆడాలి.  దీర్ఘకాలంలో ఈ పద్ధతే భారత్​ను ఒక గౌరవప్రదమైన, విశ్వసనీయమైన, ఎవరూ చెక్కుచెదర్చలేని శక్తిగా ఈ ప్రపంచంలో నిలబెడుతుంది.

భారత శైలిలో దౌత్యం

భారత దౌత్య సిద్ధాంతం నిర్లిప్తతతో కూడింది అని పొరబడకూడదు.  ఇది చురుకైంది, చొరవ తీసుకునేది,  మన నాగరిక ఆదర్శాల్లో పాతుకుపోయి ఉంది.  వినమ్రత, జ్ఞానం,  సరళతతోపాటు, దేశ ప్రయోజనాల విషయంలో  బలంగా నిలబడగలిగేది భారతీయ పద్ధతి.  తరచూ తన బలంమీద, ఎదుటిపక్షాన్ని ఆర్థికంగా ఇరుకునపెట్టడం మీద,  తక్షణ పరిష్కారాల మీద ఆధారపడిన అమెరికా దౌత్య శైలి వంటిది కాదు మనది.  భారత విధానం అనేది చర్చల్లో పరస్పర అంగీకారాలు సాధించడంలో,  నైతిక సాధికారతలో నిలబడి ఉండాలి.  మన నాగరికత వేలఏళ్ళపాటు నిలిచి గెలిచింది బల ప్రయోగం ద్వారా కాదు.. స్థిరంగా బలంగా సాగిన ఈ విధానాల వల్లనే. అందువల్లనే,  ఈ సంక్షోభ నివారణ అమెరికా పద్ధతిలో కాకుండా భారతీయ పద్ధతిలో జరగాలి.  ప్రస్తుత అమెరికాతో ఈ నిబద్ధత కలిగిన సిద్ధాంతాలతోనే వ్యవహారం జరపాలి. తలుపులు మూసేయడానికి  ఇది సమయం కాదు. 
ఈ అలజడి తగ్గించడానికి చర్చలు, సహనం, చొరవే  సరైన మార్గాలు. 

ముందున్న మార్గాలు

అమెరికాతో ఇబ్బందికరంగా ఉన్న సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి నాకు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి.
 

  • బహిరంగ వ్యాఖ్యలు మానుకోవడం:  దౌత్యం హుందాగా జరగాలి.  మాటకు మాట బదులిచ్చే ప్రకటనలు, వ్యక్తిగత విమర్శలు, హుందాగా లేని వ్యాఖ్యలకు దౌత్య ప్రతినిధులు దూరంగా ఉండాలి. 
  • శాంతియుతంగా - బలంగా చర్చించడం:  నాలుగ్గోడల మధ్య జరిగే చర్చలో భారత్ తన దౌత్య, విధానపర హద్దులను స్పష్టంగా చెప్పాలి.  వాణిజ్య సుంకాలు, భద్రత ఆందోళనలు,  సీమాంతర ఉగ్రవాదం వంటివన్నీ కూడా అనవసరమైన రచ్చ లేకుండా చర్చించదగినవే.  మన నాగరికత శాంతియుత- స్థిరమైన -సందడిలేని బలాన్ని మన దౌత్యవేత్తలు అలవరచుకోవాలి. 
  • దీర్ఘకాలిక వ్యూహం: ఇది ఒక దశ. ఈ దశ వెళ్లిపోతుంది. కాలం నడుస్తూ ఉంటుంది. 78 ఏళ్ల  స్వాతంత్ర్య దేశం ఇంతకన్నా పెద్ద సవాళ్లను ఎదుర్కొంది.  భారత్, అమెరికా సంబంధాలనేవి తాత్కాలిక ఉద్రిక్తతలతో ప్రభావితం అయిపోకూడదు. దృష్టికోణాన్ని నిలబెట్టుకోవడం కూడా కీలకమే.

- కె. కృష్ణసాగర్ రావు,
బీజేపీ తెలంగాణ ముఖ్యఅధికార ప్రతినిధి