
హైదరాబాద్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు రిలీజ్ చేసింది. శనివారం నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేయనున్నది. మంత్రి సీతక్క చొరవతో రుణాలు మంజూరు కావడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులను కూడా అందజేస్తారు. బీఆర్ఎస్ హయాంలో రూ.3000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు కొంత బ్రేక్ పడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వడ్డీలేని రుణాల చెల్లిస్తున్నది.