చేనేత రుణమాఫీకి షరతుల అడ్డంకి!

చేనేత రుణమాఫీకి షరతుల అడ్డంకి!

తెలంగాణలో  సుమారు 2 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారని అంచనా.   తెలంగాణలోని  చేనేత సంఘాలు,  కార్మికులకు  రూ.50 కోట్ల పై చిలుకు రుణాలు ఉన్నట్లు ఆ శాఖ అంచనా వేసింది.  ముఖ్యమంత్రి  రేవంత్‌‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రుణమాఫీ చేసేందుకు ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. 2017 ఏప్రిల్‌‌ 1 నుంచి  మార్చి 31 ,2024 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా  సీఎం రేవంత్‌‌రెడ్డి  రైతుల మాదిరే  చేనేత కార్మికులకు  రూ.33 కోట్ల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.  

రాష్ట్రంలో 259 చేనేత సంఘాలు ఉండగా 17 వేలకు పై చిలుకు  మగ్గాలున్నాయి.  ఒక్కోదానికి  రూ.75 వేల చొప్పున చేనేత  సహకార  సంఘాలు రుణాల పరిమితి ఉంది.  రాష్ట్రంలో 78  పవర్‌‌లూమ్‌‌ సొసైటీలుండగా వాటి పరిధిలో 49 వేల మరమగ్గాలున్నాయి.  ఈ సహాయం  నిజంగా  బలహీన స్థితిలో ఉన్న జులాహాలకు ఉపశమనంగా మారిందా?  

ప్రభుత్వం ప్రకారం 2024 చివరిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రూ.33 కోట్లు విడుదల అయ్యాయి. కానీ,  దీనికి లబ్ధిదారుల ఎంపికలో చాలా షరతులు ఉన్నాయి.  2017 ఏప్రిల్‌‌ 1 నుంచి  మార్చి 31 , 2024 వరకు మధ్యలో  రుణం తీసుకున్నవారికి  మాత్రమే. బ్యాంకు రుణమే తప్ప ఇతర కో-–ఆపరేటివ్ రుణాలు అర్హతకాదు.  లూమ్స్​ నెంబర్ ఉండాలి.  ఉత్పత్తి  కొనసాగుతున్నట్టు పత్రాలు చూపాలి.  ఆధార్,  బ్యాంకు అకౌంట్,  జీఎస్టీ  నమోదు చూపించాలి.  చేనేత కార్మికుడులాంటి  చిన్న కార్మికుడికి  ఈ షరతులు చాలామందికి అడ్డంకిగా మారాయి.  రుణం తీసుకున్నప్పుడు ప్రభుత్వమే చెప్పింది  'ఉద్యోగం లేనివారికి స్వయం ఉపాధి.'  ఇప్పుడు అదే రుణం మాఫీకి ఇన్ని షరతులా?

గణాంకాలు చెబుతున్న సత్యం

రాష్ట్రంలో చేనేత కార్మికుల సంఖ్య 2,12,000 (2023 అంచనా).   మొత్తం  రుణగ్రహీతల సంఖ్య  32,476.   రుణమాఫీ  మొత్తం రూ.33 కోట్లు.   లబ్ధిదారులకు వచ్చిన  సగటు మాఫీ  రూ.10,200 మాత్రమే.  డబ్బు పొందే అసలు లబ్ధిదారుల శాతం 28% మాత్రమే.  తిరస్కరించిన దరఖాస్తులు  సగానికి మించి ఉన్నాయి.  లబ్ధిదారులు తక్కువే.  కానీ,  గుత్తేదారులు,  మిడిల్‌‌మెన్‌‌లు లాభపడేలా ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.  ఒక్కో రుణాన్ని మాఫీ చేయడానికి  కావాల్సిన పత్రాలు 8-10 పేజీలు,  ఉదాహరణకు సిరిసిల్ల జిల్లాల్లో అందిన దరఖాస్తులు 6,245,  అంగీకరించినవి 2,312,  తిరస్కరణకి గురైనవి 3,933.   

అలాగే  గద్వాల  జిల్లాలో అందిన దరఖాస్తులు 3,110, అంగీకరించినవి 1,225,  తిరస్కరణకి గురైనవి 1,885.   వరంగల్ జిల్లాల్లో అందిన దరఖాస్తులు 5,320.  అంగీకరించినవి 2,998,   తిరస్కరణకు గురైనవి 2,322.  ఇక నల్గొండ జిల్లాల్లో అందిన దరఖాస్తులు 4,789, అంగీకరించినవి 1,654,  తిరస్కరణకి గురైనవి 3,135.  తెలంగాణ  ప్రభుత్వం  ప్రకటించిన  చేనేత  రుణమాఫీ  పథకానికి  సంబంధించిన  గణాంకాలు చూస్తే  ఆశ్చర్యం  కలుగుతుంది.   ‘జులాహాలకు ఊరట’ అని ప్రభుత్వం చెబుతోంది.   కానీ, షరతుల సంఖ్య ఎక్కువ. అర్హుల సంఖ్య తక్కువ. 

రుణమాఫీ లోపాలు 

తెలంగాణ  రాష్ట్ర  ప్రభుత్వం  రుణమాఫీకి మార్గదర్శకాలు రూపొందించినప్పటికీ  వాటిలో  కొన్ని ప్రధాన లోపాలు కనిపిస్తున్నాయి.  గరిష్ట పరిమితి  రూ.1 లక్ష మాత్రమే,  చేనేత కార్మికుల రుణాలు చాలావరకు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఉన్నాయి.  కానీ, ఈ పథకం కింద  కేవలం  రూ.1 లక్ష వరకే  మాఫీ ఇవ్వడంతో  మిగిలిన  మొత్తం  వడ్డీతోసహా  కార్మికులకు  భారం అవుతుంది.  ఇది సామాన్య  కార్మికుడు  పూర్తిగా విముక్తి పొందేందుకు అనుకూలంగా లేదు.   కాలపరిమితి లోపం,  ఏప్రిల్ 1, 2017 నుంచి  మార్చి 31, 2024 వరకు  తీసుకున్న  రుణాలకే మాఫీ వర్తిస్తుంది.  

అయితే,  2016 లోగానీ,  2024  ఏప్రిల్  తర్వాత తీసుకున్న రుణాలుగానీ పరిగణనలోకి రావడం లేదు.  ఇది అనేకమంది అర్హులైనవారిని తప్పించేస్తుంది.  అంతేకాదు వ్యక్తిగత రుణం తీసుకున్నవారికి ఇది వర్తించదు.  అలాగే షరతులు ఎక్కువగా ఉండటం, పథకానికి అర్హత నిరూపించేందుకు అనేక డాక్యుమెంట్లు,   పత్రాలు అవసరం.  గ్రామీణ చేనేత కార్మికులకు ఈ డాక్యుమెంట్లను పొందటం కష్టంగా మారుతుంది.  

రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం – ఆలస్యం

జిల్లా స్థాయి కమిటీ  ఆమోదించినప్పటికీ  రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం వచ్చేవరకు చెల్లింపులు జమ కావు.  ఇది చివరి దశలో అనవసర ఆలస్యానికి దారి తీస్తుంది.  నిధుల పరిమితి  తక్కువ.  మొత్తం రూ.33 కోట్లు మాత్రమే కేటాయించడమైంది.   ఇది రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సంఖ్య దృష్ట్యా చాలా తక్కువ.  ఒక్కో  కుటుంబానికి  రూ.1 లక్షగా చూసుకున్నా,  కేవలం 3,300 మందికే  మాఫీ అమలు అవుతుంది.  రాష్ట్రంలో లభ్యమైన సమాచారం ప్రకారం 30,000–35,000  చేనేత  కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ఈ పథకం కింద కేవలం 15% – 20%  లోపలే లబ్ధిదారులకు మాఫీ లభిస్తుంది.  మిగిలినవారిని  ఇంకో  విడతలో  చేర్చుతామంటూ ప్రభుత్వం ప్రకటించినా, అది రాజకీయ  ప్రకటనగా మిగిలే ప్రమాదం ఉంది. మంచి ఉద్దేశంతో ప్రారంభించినా, నిధుల పరిమితి, షరతుల భారీకరణ, కాలపరిమితి లోపం సమస్యగా మారింది.

ప్రోత్సాహం కల్పించాలి

చేనేత  కుటుంబాల  మనోభావాలను గౌరవించాలంటే   నేరుగా ముడి సరుకులపై  సబ్సిడీ అందించాలి.  వన్-స్టాప్ స్కీమ్ క్లియరెన్స్ హబ్,   చేనేత మార్కెట్ డిజిటల్ ప్లాట్‌‌ఫామ్,  చేనేతకు ప్రత్యేక వార్షిక బడ్జెట్. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌‌లు, జీఐ ట్యాగ్​ ప్రచారం. పథకాలలో పారదర్శకత ఉండాలి.  అన్ని దరఖాస్తులను  ఆన్​లైన్​లో  అందుబాటులో  పెట్టాలి.  జీఐ ట్యాగ్ ఉత్పత్తులకు ప్రోత్సాహం,  రాయితీలు,  ఎగుమతులకు  ప్రోత్సాహం కల్పించాలి.   ఒక గ్రామం – ఒక డిజైన్ మిషన్ – ప్రాధాన్యత ఆధారంగా శిక్షణ & మార్కెట్ యాక్సెస్ ఉండాలి.   ప్రభుత్వ బడ్జెట్‌‌లో  చేనేతకు  కనీస 1%  నిర్దిష్ట నిధి,   ప్రభుత్వ స్కూళ్లు,  ఆసుపత్రుల కోసం  చేనేత  డ్రెస్ కోడ్ – స్టాబిల్ ఆర్డర్,   చేనేత కార్మికుల పిల్లలకు విద్య,  వృత్తిపర శిక్షణ ఇవ్వాలి.  రుణమాఫీతో  అండగా నిలవాలి.  అదే తెలంగాణ చేనేతకు తిరిగి ప్రాణంపోసే మార్గం!

షరతులు తగ్గించి.. ప్రాణం పోయండి! 

తెలంగాణ  ప్రభుత్వం  ప్రకటించిన రుణమాఫీ.. తాత్కాలిక ఉపశమనమే. దీనివలన పునరుజ్జీవన సాధ్యం కాదు.  కొంతమందికైనా ఊరట ఇవ్వాలి అన్న ఆశయంతో ప్రారంభమైనా.. నిబంధనల వల్ల ప్రయోజనం పొందేవారు తక్కువగా మిగిలారు.  ఇది  వృత్తిపరంగా బలహీనమవుతున్న చేనేత కార్మికులకు  గౌరవం,  ఆదాయం,  భద్రత కలిగించేలా మారితే  అప్పుడు ప్రభుత్వ సంకల్పం నిజంగా ఫలిస్తుంది.  

- డా. కేశవులు భాషవత్తిని
సైకియాట్రి, సోషల్​ యాక్టివిస్ట్