జైషే మహ్మద్ చీఫ్ అజార్ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డు పడింది. ఐకరాజ్యసమితిలో అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ ప్రతిపాదనకు.. సాంకేతిక కారణాలు చూపుతూ.. నో చెప్పింది చైనా. మసూద్ ను చైనా వెనకేసుకు రావడం ఇది నాలుగోసారి. డ్రాగన్ తీరుపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తామని తేల్చిచెప్పింది.
చైనా మరోసారి వక్రబుద్ది చాటుకుంది. అమెరికా హితోక్తులనూ పక్కనబెట్టి మళ్లీ ఉగ్రవాదికి మద్దతు ఇచ్చింది. జేషే మహ్మద్ చీఫ్ అజార్ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి అడ్డుపుల్ల వేసింది. ఐకరాజ్యసమితిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చేసిన ప్రతిపాదనకు నో చెప్పింది చైనా. దీంతో పుల్వామా, ఉరీ. భారత పార్లమెంటు సహా అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి.. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రయత్నం మరోసారి నిలిచిపోయింది. మసూద్ ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఇప్పటికే మూడుసార్లు అడ్డుకున్న చైనా.. నాలుగోసారి కూడా సాంకేతిక కారణాలు చూపుతూ ఉగ్రవాదికే ఫేవర్ చేసింది.
పుల్వామా దాడి నేపథ్యంలో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత నెల 27న UNలోని అల్ కాయిదా శాంక్షన్స్ కమిటీకి శాశ్వత సభ్య దేశాలు అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ ప్రతిపాదించాయి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలంటూ కమిటీ పది రోజుల గడువు ఇచ్చింది. నిన్న అర్ధరాత్రి 12.30 గంటలకు ఆ గడువు ముగిసింది. గడువులోపు ఎటువంటి అభ్యంతరాలూ రాకపోతే, మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేది. అయితే, చివరి నిమిషం వరకూ సస్పెన్స్ ను కొనసాగించిన చైనా.. తుది గడువుకు అరగంట ముందు సాంకేతికంగా అడ్డుపుల్ల వేసింది. దీంతో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రయత్నాలకు నాలుగోసారి అడ్డుపడింది.
మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ విజ్ఞప్తులను భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా 2009 నుంచీ అడ్డుకుంటోంది. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని చైనా అడ్డుకోవడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారతీయులపై హీనమైన దాడులు చేసిన ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలనూ కొనసాగిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా పేరు ప్రస్తావించకుండానే ప్రతిపాదనను నిలుపు చేయడంతో కమిటీ నిర్ణయం తీసుకోలేకపోయిందని వ్యాఖ్యానించింది.
