చైనాది అసాధారణమైన డిమాండ్: పి.చిదంబరం

చైనాది అసాధారణమైన డిమాండ్: పి.చిదంబరం

న్యూఢిల్లీ: చైనా సైనిక దళాలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో బార్డర్‌‌లో యథాతథ స్థితిని మార్చడం కాదనలేనిదని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ఇండో–చైనా బార్డర్‌‌లో యథాతథ స్థితిని నెలకొల్పడంలో ప్రధాని మోడీ సక్సెస్ అవుతారా లేదా అని ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీ తమదేనని మరోసారి చైనా అనడంపై చిదంబరం సీరియస్ అయ్యారు.

‘లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీ తమదేనని చైనా విదేశాంగ శాఖతోపాటు పీఎల్‌ఏ వాదిస్తోంది. అలాగే అక్కడి నుంచి ఇండియా ఖాళీ చేయాలని అంటోంది. ఇది అసాధారణమైన డిమాండ్’ అని చిదంబరం మండిపడ్డారు. ఇప్పుడు యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి కేంద్రం సరైన వైఖరి తీసుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ సర్కార్ ఇండియా డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తుందా? అలాగే యథాతథ స్థితిని పునరుద్ధరిస్తుందా అని ప్రశ్నించారు. కాగా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి డ్రాగన్ కంట్రీ సైనికుల మోహరింపులు ఎక్కువయ్యాయి. ఈ నెల 22వ తేదీన విడుదలైన శాటిలైట్ ఇమేజెస్‌లో ఎల్‌ఏసీ వెంబడి పీఎల్‌ఏ జవాన్లు, మిలటరీ వెహికిల్స్ కదలికలు బయటపడ్డాయి.