10 మంది మనవాళ్లను రిలీజ్‌ చేసిన చైనా

10 మంది మనవాళ్లను రిలీజ్‌ చేసిన చైనా
  • చర్చల తర్వాత రిలీజ్‌ చేసేందుకు ఒప్పుకున్న చైనా

న్యూఢిల్లీ: గాల్వాన్‌ లోయలో ఈ నెల 15న జరిగిన ఘర్షణల్లో చైనా నిర్భంధించిన మన ఆర్మీ జవాన్లలో 10 మందిని రిలీజ్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గొడవ జరిగిన తర్వాత మూడు రోజులు జరిగిన చర్చల అనంతరం రిలీజ్‌ చేసేందుకు చైనా ఒప్పుకున్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి నేషనల్ మీడియాతో చెప్పారు. చర్చలు తర్వాత గురువారం రాత్రి వారిని రిలీజ్‌ చేశారని అన్నారు. 10 మందిలో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్మీ, ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌ మినిస్ట్రీ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. గాల్వాన్‌ వ్యాలీ సంఘటన జరిగిన తర్వాత మంగళవారం నుంచి గురువారం వరకు మూడు ఆర్మీ అధికారులు చర్చలు జరిపారు. కాగా.. సైనికులంతా సేఫ్‌గా ఉన్నారని, ఎవరూ చైనా అధీనంలో లేరని ఆర్మీ, ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌ మినిస్ట్రీ వెల్లడించిన విషయం తెలిసిందే. గాల్వాన్‌ వ్యాలీలో జరిగిన గొడవలో చైనా సైనికులు రాళ్లు, ముల్ల కంచెలతో దాడి చేయడంతో మన ఆర్మీకి చెందిన 20 మంది చనిపోయారు. చైనాకు చెందిన 43 మంది మరణించారని సమాచారం. మన సైనికులను కొంత మందిని వారు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి.