కంట్రోల్ తప్పిన చైనా రాకెట్.. ఎల్లుండి భూమిపై పడే ఛాన్స్

కంట్రోల్ తప్పిన చైనా రాకెట్.. ఎల్లుండి భూమిపై పడే ఛాన్స్

చైనా పంతం మరో ముప్పు తెచ్చిపెట్టింది. నాసాకు పోటీగా.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌‌కు ఆల్టర్నేటివ్‌‌గా సొంత స్పేస్‌‌ స్టేషన్ ఏర్పాటు చేసుకునేందుకు చైనా గత గురువారం ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ అంతరిక్షంలో అదుపుతప్పింది. చైనా స్పేస్ ఏజెన్సీ కంట్రోల్‌‌ నుంచి చేజారిన ఈ రాకెట్ ఇప్పుడు భూమిపైకి దూసుకొస్తోంది. మే 8న (శనివారం) అమెరికాలోని న్యూయార్క్,  యూరప్‌‌లోని మాడ్రిడ్, ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్‌‌లలో ఏదో ఒక ప్రాంతాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందని అమెరికా స్పేస్ కమాండ్ కంట్రోల్ అంచనా వేస్తోంది. వంద అడుగుల పొడవు, దాదాపు 22 టన్నుల బరువున్న ఈ రాకెట్​ జనావాసాలపై పడితే భారీ విధ్వంసం తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే అది వచ్చే స్పీడ్‌‌కు భూమి వాతావరణంలో ప్రవేశించగానే పూర్తిగా కాలిపోతుందని, నేలను తాకి నష్టం చేసే ప్రమాదం ఉండకపోవచ్చని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు.

అమెరికాకు పోటీగా చైనా లాంచ్ చేసిన రాకెట్​.. ఇప్పుడు అమెరికాకు ఊహించని ముప్పు తెచ్చిపెట్టింది. నాసా ఆధ్వర్యంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు ఆల్టర్నేటివ్‌‌గా చైనా సొంతంగా స్పేస్‌‌ స్టేషన్ నిర్మిస్తోంది. దాని కోసం గత వారంలో స్పేస్‌‌ స్టేషన్ మెయిన్ మాడ్యూల్‌‌ను లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా రోదసిలోకి ప్రయోగించింది. కానీ ఆ రాకెట్​ ఇప్పుడు కంట్రోల్ తప్పింది. చైనా స్పేస్ మిషన్ కంట్రోల్‌‌ చేతులెత్తేసింది. స్పేస్‌‌లో కంట్రోల్ తప్పిన ఆ రాకెట్ భూమి వైపు దూసుకొస్తోంది. మే 8న అమెరికాలోని మేజర్ సిటీ అయిన న్యూయార్క్‌‌పై పడే ప్రమాదం ఉందని ఆ దేశం ఇప్పటికే అంచనా వేసింది.
23 వేల కిలోమీటర్ల స్పీడ్‌‌తో..
అదుపు తప్పిన చైనా రాకెట్​ 100 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంది. 22 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్ గంటకు 23 వేల కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తోంది. దీనిని ఎప్పటికప్పుడు అమెరికా యూఎస్ స్పేస్ కమాండ్ ట్రాక్ చేస్తోంది. శనివారం భూమిపై పడుతుందని చెప్పగలిగినప్పటికీ, కచ్చితంగా ఏ ప్లేస్‌‌లో పడుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నామని అమెరికా డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ మైక్ హోవర్డ్ చెప్పారు. అది భూమిపై పడే కొద్ది గంటల ముందు మాత్రమే ఎక్కడ ఢీకొడుతుందో చెప్పగలమన్నారు. ఆ రాకెట్ ట్రాజెక్టరీని ఎప్పటికప్పుడు స్సేస్ ట్రాక్ వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌డేట్ చేస్తున్నామని, బుధవారం ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం అది న్యూయార్క్‌‌ సమీపంలో పడే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు. అయితే కచ్చితంగా న్యూయార్క్ అనే చెప్పలేమని, కాలిఫోర్నియా, యూరప్‌‌లోని మాడ్రిడ్, ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్.. ఎక్కడైనా పడొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
ప్రమాదం తక్కువే అంటున్న సైంటిస్టులు
స్పేస్​ స్టేషన్‌‌ కోసం చైనా ఏప్రిల్ 29న లాంగ్ మార్చ్ బీ5 రాకెట్‌‌ను లాంచ్ చేసింది. స్పేస్‌‌లోకి వెళ్లాక కంట్రోల్ తప్పిన ఈ రాకెట్ భూమిపైకి వేగంగా దూసుకొచ్చే క్రమంలో ముక్కలైపోవచ్చు. అలాగే అది కిందికి పడే స్పీడ్‌‌కు మన వాతావరణంలోకి వచ్చేలోపే పూర్తిగా మండిపోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. చైనా రాకెట్ భూమిని తాకి నష్టం కలిగించే అవకాశాలు చాలా తక్కువేనని హార్వర్డ్ యూనివర్సిటీ ఆస్టోఫిజిక్స్ సైంటిస్ట్ జోనథన్ మెక్ డొవెల్ అన్నారు. దీని గురించి జనం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనిలేదని, ఎక్కడ పడుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన అవసరం అసలే లేదని చెప్పారు. అది అమెరికా, యూరప్ లేదా న్యూజిలాండ్ సమీపంలో ఎక్కడైనా సముద్రంలో పడిపోయే చాన్స్ కూడా లేకపోలేదన్నారు. కొన్ని భారీ ముక్కలు భూమిపై పడే చాన్స్​ ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 
అసలు భయమే లేదంటున్న చైనా
రాకెట్ అదుపు తప్పినప్పటికీ దాని ట్రాజెక్టరీని ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తున్నామని, తమ అంచనా ప్రకారం జనాలు అసలు భయపడాల్సిన పనిలేదని చైనా స్పేస్ ప్రోగ్రామ్ చెబుతోంది. అది మన వాతావరణంలోకి ప్రవేశించాక ఎన్ని ముక్కలు మిగులుతాయో కూడా తెలియదని, ఒక వేళ స్పేస్ మాడ్యూల్ కోర్ మిషన్ కిందకు వచ్చినా అది జనావాసాలు లేని చోటనో, సముద్రంలోనో పడుతుందని అంటోంది. అయితే గత ఏడాది చైనా ఈ స్పేస్ స్టేషన్ కోసమే పంపిన రాకెట్ ఇలానే కంట్రోల్ తప్పి భూమిపై పడింది. అది ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్‌‌పై పడి, కొన్ని ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఆ సమయంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. ఆ సంఘటననే సైంటిస్టులు ఉదాహరణగా చెబుతున్నారు. ఆ రాకెట్ భూమిపై పడినప్పుడు కూడా మన వాతావరణంలోకి వచ్చేటప్పటికే మండిపోయిందని, కొన్ని మెటల్ రాడ్స్ మాత్రమే మిగిలాయని, దాంతో పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని గుర్తు చేస్తున్నారు.
అమెరికాను మించిన పవర్ కావాలనే
2030 కల్లా స్పేస్‌‌లో అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని మించిన పవర్‌‌‌‌గా ఎదగాలన్నదే చైనా లక్ష్యం. ఇందు కోసమే చైనా అంతరిక్షంలో తనకంటూ సొంత స్పేస్‌‌ స్టేషన్ నిర్మాణం మొదలుపెట్టింది. ఇది పూర్తయితే ఆస్ట్రోనాట్స్ తమ స్పేస్ క్రాఫ్ట్‌‌లను దీనికి డాకింగ్ (పార్కింగ్ లాంటిది) చేసి, స్పేస్‌‌లోనే ఉండి ప్రయోగాలు చేయొచ్చు. అయితే దీనిని పూర్తి చేయాలంటే చైనా మొత్తం 11 రాకెట్లను లాంచ్ చేయాల్సి ఉంది. టైంగాంగ్ అన్న పేరుతో చైనా ఆ స్పేస్ స్టేషన్‌‌ను నిర్మిస్తోంది. దీనికి చైనా భాషలో  స్వర్గం అని అర్థం. 2011 నుంచే దీని నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే దాని మొత్తం బరువు 100 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం స్పేస్‌‌లో ఉన్న ఐఎస్ఎస్‌‌ బరువులో ఇది పావు వంతు మాత్రమే. కాగా, 1998లో మొదలుపెట్టిన ఐఎస్ఎస్ నిర్మాణం పూర్తి చేయడానికి మొత్తం 30 రాకెట్ లాంచ్‌‌లతో, పదేండ్ల సమయం పట్టింది. దీనిలో అమెరికాతో పాటు రష్యా, జపాన్, యూరప్, కెనడా స్పేస్ ఏజెన్సీలు కూడా కలిసి పని చేశారు. కానీ చైనా మాత్రం ఈ మిషన్‌‌కు దూరంగా ఉండిపోయింది.