క్వాడ్‌‌కు మేం వ్యతిరేకం.. సమస్యలు సృష్టిస్తే ఊరుకోం

క్వాడ్‌‌కు మేం వ్యతిరేకం.. సమస్యలు సృష్టిస్తే ఊరుకోం

బీజింగ్: భారత్ నేతృత్వంలోని క్వాడ్ కూటమికి తాము వ్యతిరేకం అని చైనా తెలిపింది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కూటమిపై చైనా ఫైర్ అయ్యింది. ఏమీ లేని చోట అనవసరంగా సమస్యలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని అమెరికాను డ్రాగన్ కంట్రీ హెచ్చరించింది. ఈ ప్రాంతంలో శాంతిని పెంపొందించేందుకు పాటుపడాలని చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ డిఫెన్స్‌‌లో సీనియర్ కర్నల్‌గా పనిచేస్తున్న రెన్‌గావ్ కియాంగ్ పేర్కొన్నారు. 

‘అమెరికా ప్రోద్బలంతో మొదలైన క్వాడ్‌‌ను మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ సదస్సు ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులను కొనసాగిస్తూ ఇక్కడి దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. తన ఆధిపత్యం కొనసాగాలని యూఎస్ మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. చైనాను ప్రమాదకారిగా చిత్రించడాన్ని అస్సలు సహించబోం. ఇరు దేశాల ఆసక్తులకు గానీ ప్రపంచానికి పనికొచ్చే విధంగా గానీ యూఎస్ వ్యాఖ్యలు లేవు. చైనా ఎవర్నీ చాలెంజ్ చేయాలని అనుకోదు. కానీ ఎవరైనా మాకు సవాళ్లు విసిరితే మాత్రం భయపడబోం. మేం ఎవరికీ ముప్పు తలపెట్టం. అదే సమయంలో మా సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మా మిలటరీ కట్టుబడి ఉంది. కాబట్టి ఈ ప్రాంతం గురించి యూఎస్ పూర్తిగా అర్థం చేసుకోవాలి’ అని రెన్‌‌గావ్ చెప్పారు.