
బీజింగ్: చైనా.. అత్యధిక జనాభా ఉన్న దేశం. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అగ్రదేశం అమెరికాను ఢీకొంటున్న డ్రాగన్. టెక్నాలజీ నుంచి ఒలింపిక్స్ వరకు అన్ని రంగాల్లో ముందుంటుంది. ఎప్పుడూ బిజీ. ఉరుకులు పరుగుల జీవితం గడుపుతూ ఉంటుంది. ఈ పోటీలో పడి హ్యాపీగా బతకడం మరిచిపోయింది. ఒంటరితనం అనుభవిస్తోంది. ఎన్నోఏళ్ల కిందట నాటి ‘ఒక్కరు చాలు’ పాలసీ కూడా ఇందుకు తోడైంది. దీంతో లక్ష రెండు లక్షలు కాదు.. చైనాలో ఏకంగా 20 కోట్ల మందికిపైగా సింగిల్‌గానే ఉన్నారట. దీంతో అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన యూత్ వింగ్.. యువతీ, యువకులను కలిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. విచిత్రమైన కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘లవ్ట్రైన్’
మూడేళ్ల కిందట..
లవ్ ట్రైన్.. ఐ999… లవ్ పర్స్యూట్.. పేరు ఏదైనా ఉద్దేశం ఒకటే. ఒంటరి పక్షులను జంటగా మార్చడం. మూడేళ్ల కిందట రైలు సర్వీసు ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం మూడుసార్లు మాత్రమే ఈ రైలు బయలుదేరింది. 3 వేల మంది జర్నీ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 10న చోంగ్క్వింగ్నార్త్ స్టేషన్నుంచి కియాంజియాంగ్ స్టేషన్ వైపు రైలు బయలుదేరింది. రెండు పగళ్లు, ఒక రాత్రి ఈ ప్రయాణం సాగుతుంది. యువత తమకు లైఫ్పార్ట్ నర్గా సరిపోయే వాళ్లను ఎంచుకోవచ్చు. రైలులో ఉన్న వారిలో ఎవరైనా నచ్చితే స్నేహం చేయొచ్చు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. లేకుంటే ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు. లేదా జర్నీ పూర్తయ్యాక ఎవరిదారి వాళ్లు చూసుకోవచ్చు. వీరందరికి రైలులోనే భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. బోర్‌కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ప్రోగ్రామ్స్కూడా ఉంటాయి. నిజానికి ఈ వెరైటీ ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తోందట. వందలాది మందిని ఒకేచోటుకు చేర్చిందట. లవ్ పర్స్యూట్ ట్రైన్లో ప్రయాణించిన 10 జంటలు పెళ్లి చేసుకున్నాయట.