లోక్​సభ ఎన్నికల్లో చైనా జోక్యం!

లోక్​సభ ఎన్నికల్లో చైనా జోక్యం!
  •     ఏఐ సాయంతో కుట్ర చేస్తోందని మైక్రోసాఫ్ట్ వార్నింగ్​
  •     64 దేశాల ఎన్నికల్లో వేలు పెట్టాలని ప్రయత్నిస్తోందని వెల్లడి

న్యూఢిల్లీ: మన సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో జోక్యం చేసుకోవడానికి కుట్రలు చేస్తోందని మైక్రోసాఫ్ట్  ఓ ప్రకటనలో హెచ్చరించింది. లోక్ సభ ఎన్నికల్లో అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆ సంస్థ పేర్కొంది.  ఇటీవల జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికలలో ఈ టెక్నాలజీపై ట్రయల్ రన్ నిర్వహించిందని పేర్కొంది. 

యురోపియన్  యూనియన్  సహా దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయని చెబుతూ.. చైనా మద్దతున్న సైబర్  గ్రూపులు నార్త్  కొరియాతో కలిసి ఆయా దేశాల ఎన్నికల్లో వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మైక్రోసాఫ్ట్​కు చెందిన థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం వెల్లడించింది. ‘ఫలితాలు తమకు అనుకూలంగా రావడానికి ఏఐ సాయంతో కంటెంట్ తయారుచేసి సోషల్  మీడియాలో ప్రచారం చేస్తూ  ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది.

 ముఖ్యంగా ఇండియా, దక్షిణ కొరియా, అమెరికాలో జరిగే ఎన్నికల్లో తన ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చుకోవడానికి ఏఐ టెక్నాలజీని చైనా వాడుకోవచ్చు. ఈ టెక్నాలజీతో చైనా విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నది. తైవాన్  ఎన్నికల సమయంలో చైనా మద్దతు ఉన్న స్టార్మ్  1376 అనే గ్రూప్  చాలా యాక్టివ్​గా పనిచేసింది. అభ్యర్థులపై అసత్య ప్రచారం, ఫేక్  ఆడియో కంటెంట్, మీమ్స్ ను సోషల్  మీడియాలో ప్రసారం చేయడం చేసింది” అని మైక్రోసాఫ్ట్  ఇంటెలిజెన్స్  టీం  వివరించింది.

అమెరికానూ వదలడం లేదు

త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఏఐ టెక్నాలజీ సాయంతో వేలు పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందని మైక్రోసాఫ్ట్  ఇంటెలిజెన్స్  టీం తెలిపింది. ఇందుకోసం సోషల్  మీడియా వేదికలు వాడుకొని, ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చేలా చూసుకోవడానికి ప్లాన్  చేస్తోందని పేర్కొంది.