అరుణాచల్​లోని ప్రాంతాలకు చైనా పేర్లు

అరుణాచల్​లోని ప్రాంతాలకు చైనా పేర్లు

న్యూఢిల్లీ :  అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ వాదిస్తున్న చైనా తాజాగా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. ఎల్ఏసీ వెంట ఉన్న అరుణాచల్​లోని 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. ఈమేరకు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ నాలుగో లిస్ట్ రిలీజ్ చేశాయి. ఈ వివరాలను చైనా అధికారిక పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని చైనా ‘జాంగ్​నన్’ అంటూ వ్యవహరిస్తోంది. తాజాగా పేర్లు పెట్టుకున్న వాటిలో 11 రెసిడెన్షియల్ ఏరియాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక చెరువు, ఒక పర్వత ప్రాంత రహదారి, కొంత భూమి కూడా ఉన్నది. ఆ పేర్లు ఏంటనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. చైనా క్యారెక్టర్లు, టిబెటన్, పిన్​యిశ్ భాషల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. 

‘స్టేట్ కేబినెట్ భేటీలో 30 ప్రదేశాలకు పేర్లు నిర్ణయించాం. నిబంధనలకు అనుగుణంగా చైనాలోని జాంగ్​నన్ భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెట్టాం. కొత్త జాబితాను రిలీజ్ చేశాం. మే 1 నుంచి ఈ పేర్లు అమల్లోకి వస్తాయి’ అంటూ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది. అరుణాచల్​ప్రదేశ్​లోని ఆరు ప్రదేశాలకు పేర్లు నిర్ణయిస్తూ 2017లో ఫస్ట్ లిస్ట్​ను, 2021లో 15 ప్రదేశాలతో సెకండ్ జాబితాను, 2023లో మరో 11 ప్రదేశాలకు పేర్లు పెట్టి మూడో లిస్ట్​ను చైనా విడుదల చేసింది. తాజాగా 30 ప్రదేశాలకు పేర్లు పెట్టి నాలుగో లిస్ట్​ను రిలీజ్ చేసింది.

అరుణాచల్ ఎప్పటికీ మాదే: జైశంకర్

అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. ప్రదేశాల పేర్లు మార్చినంత మాత్రాన.. ఓనర్లు మారరని అన్నారు. ‘ఓ ఇంటికి నా పేరు పెట్టుకుంట.. అప్పుడు ఆ ఇల్లు నాదే అవుతుందా? కొన్ని ప్రాంతాలకు చైనా తన భాషలో పేర్లు పెట్టుకున్నంత మాత్రాన అవి ఆ దేశానివి కావు. ఎప్పటికీ ఆ ప్రదేశాలు ఇండియాలోనే ఉంటాయి’ అని జైశంకర్ స్పష్టం చేశారు.