బ్రహ్మోస్​ ముందు చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం బలాదూర్..

బ్రహ్మోస్​ ముందు చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం బలాదూర్..
  • పాక్​, చైనా రక్షణ వ్యవస్థలపై అమెరికా యుద్ధ నిపుణుడు జాన్ స్పెన్సర్

న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్ మిసైల్ ముందు చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ మాత్రం సరితూగవని అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ యుద్ధ నిపుణుడు పేర్కొన్నాడు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మోస్ ముందు జుజూబీ అంటూ.. భారత మిసైల్ సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాకు చెందిన కర్నల్ (రిటైర్డ్) జాన్ స్పెన్సర్ ఓ మీడియా చానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్​లో ఎప్పుడైనా, ఎక్కడైనా దాడి చేయగలమనే బలమైన సందేశాన్ని ఇండియా పంపిందన్నారు. పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు, భారత బ్రహ్మోస్ క్షిపణులకు సరితూగవని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్​లోని ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడులకు భారత్ ఈ మిసైల్​ను ఉపయోగించిందని.. కానీ, వాటిని అడ్డుకోవడంలో పాక్, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేతులేత్తేసిందని పేర్కొన్నారు. 

ఒకే సమయంలో పాకిస్తాన్​లోని వేర్వేరు ప్రాంతాల్లో దాడి చేయడం.. అలాగే పాక్​ డ్రోన్ దాడులు, హై-స్పీడ్ క్షిపణులను భారత్​ విజయవంతంగా  ఎదుర్కొందని ప్రశంసించారు. "చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు భారతదేశ వ్యవస్థలతో పోలిస్తే తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణి చైనా, పాక్​ వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించింది. పాకిస్తాన్​లోని ఏ ప్రదేశంలోనైనా ఎప్పుడైనా దాడి చేయగలమనే భారత్ సందేశం స్పష్టంగా ఉంది" అని స్పెన్సర్ పేర్కొన్నారు.