చిన్నోనిపల్లి నిర్వాసితులకు .. కొత్త కష్టాలు!

చిన్నోనిపల్లి నిర్వాసితులకు .. కొత్త కష్టాలు!
  •  కట్ట ఎత్తు పెంపుతో రిజర్వాయర్ లోకి చేరుతున్న నీళ్లు
  •  పనులు అడ్డుకున్నారంటూ గతంలో రైతులపై నాన్  బెయిలబుల్  కేసులు
  • ఇప్పుడు కేసులను తెరపైకి తెస్తున్న పోలీసులు 
  • ఆర్అండ్ఆర్  కాలనీలో సౌలతులు లేక ఆందోళన

గద్వాల, వెలుగు : ఎలాంటి ఆయకట్టు లేని చిన్నోనిపల్లి రిజర్వాయర్ తో పని లేదు. తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్  చేసిన పాపానికి గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ రైతులను ప్రభుత్వం, ఆఫీసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాన్  బెయిలేబుల్  కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని నిర్వాసిత రైతులు వాపోతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను నిర్మించేందుకు 2005లో భూసేకరణ చేసి 2006లో పనులు ప్రారంభించారు.

ఆ తర్వాత పనులు నిలిచిపోయాయి. దాదాపు 14 ఏండ్ల తరువాత ఇటీవల పనులు చేపట్టడంతో నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో ఆఫీసర్లు, పోలీస్ ప్రొటెక్షన్​తో నిర్వాసితులను అదుపులోకి తీసుకొని పనులు చేపట్టారు. అప్పటి నుంచి పనులు నిలిపివేయాలని నిర్వాసితులు డిమాండ్  చేస్తూనే ఉన్నారు.

రైతులపై నాన్  బెయిలబుల్  కేసులు..

నిర్వాసిత రైతులు రిజర్వాయర్  పనులు అడ్డుకుంటున్నారని పోలీసులు నాన్  బెయిలబుల్  కేసులు నమోదు చేశారు. మే నెలలో కేసులు నమోదు చేసి, ఇప్పుడు వాటిని తెరపైకి తీసుకొస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పనులకు అడ్డు తగులుతున్నారని చిన్నోనిపల్లి రిజర్వాయర్  సైట్  ఇంజనీర్  ఉపేందర్  ఫిర్యాదు మేరకు నరేశ్, వీరన్న, నరసింహులు గౌడ్, రామచంద్ర గౌడ్, ధర్మారెడ్డి, కురువ వెంకటేశ్ లపై 143, 147, 341 326(బి), 506 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇందులో 326 (బి) సెక్షన్  కింద ఉద్దేశపూర్వకంగా యాసిడ్  దాడులకు పాల్పడుతున్నారనే నేరం కింద కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిర్వాసితులపై  నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం పట్ల బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులతో పాటు ప్రజాసంఘాల లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కట్ట ఎత్తు పెంపుతో ఆందోళన..

చిన్నోనిపల్లి రిజర్వాయర్  కట్ట ఎత్తు పెంచడం, రిజర్వాయర్ కి నీటిని విడుదల చేస్తుండడం, వానలకు ఇప్పటికే నీళ్లు చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గట్టు మండలంలోని చిన్నోనిపల్లి, బోయిలగూడెం, ఇందువాసి, లింగాపురం, చాగదోన గ్రామాల్లోని రైతుల నుంచి 2006 ఎకరాల భూమి సేకరించారు. చిన్నోనిపల్లి గ్రామంలోని 201 ఇండ్లు ముంపునకు గురవుతున్నాయని గుర్తించి పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత రిజర్వాయర్  పనులు ఆగిపోవడంతో గ్రామస్తులు ఊరిని ఖాళీ చేయలేదు. అప్పటి నుంచి  ఏమనకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు.

ఆర్అండ్ఆర్  కాలనీలో సౌలతుల్లేవ్..

ముంపునకు గురవుతున్న చిన్నోనిపల్లి గ్రామ సమీపంలోనే ఆర్అండ్ఆర్  సెంటర్ కోసం భూసేకరణ చేశారు. అక్కడ గతంలోనే మట్టి రోడ్లు వేశారు. వాటర్ ట్యాంక్, డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటర్  ట్యాంక్​ కూలిపోయేలా ఉండగా, డ్రైనేజీలు కూలిపోయి మట్టితో నిండిపోయాయి. బోర్లు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు నిర్వాసితులు ఇల్లు కట్టుకుందామన్నా, అక్కడ సౌలతులు లేవు. ఆర్అండ్ఆర్ సెంటర్ లో వసతులు కల్పించకుండా, ఎప్పుడో ఆగిపోయిన పనులను ముందేసుకొని తమను బలి పశువులను చేస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. 

సమస్యను పరిశీలిస్తాం..

నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు కల్పిస్తాం. నీటి నిల్వతో నిర్వాసితులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

- శ్రీనివాసులు, అడిషనల్  కలెక్టర్